అత్యాచారం చేసిన అనంతరం దుండగులు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు


కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని దుండగులు మైనర్ బాలికను అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన అనంతరం దుండగులు బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దీంతో.. బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే... తెలంగాణకు చెందిన ఓ కుటుంబం పనుల కోసం కర్నూలు వలస వచ్చారు. అయితే.. గాలేరు-నగరి కాలువ సిమెంట్ కాంక్రీట్ పనులకు తల్లిదండ్రులతో బాలిక వచ్చింది. 

అక్కడున్న కొందరు కామాంధులు బాలికపై కన్నేసారు. అమ్మాయికి మాయమాటలు చెప్పి దూరంగా తీసుకువెళ్లారు. అనంతరం ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక నోరు విప్పతే తమకు ప్రమాదమని భావించి.. బాలిక ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పు అటంటించారు. దీంతో బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన బనగానపల్లె మండలం యాగంటిపల్లెలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతురాలు తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మర్రికెళ్ళ మండలానికి చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. బాలిక మరణ వార్త తెలుసుకొని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.