చిత్తూరు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని కత్తితో కడుపుమీద పలుమార్లు పొడిచాడో యువకుడు. ఈ ఘటనలో ఇద్దరూ మైనర్లు కావడం విశేషం. 

వివరాల్లోకి వెడితే గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం తూర్పు పల్లి గ్రామానికి చెందిన గాయత్రి (19) అనే యువతిని పూతలపట్టు మండలం చింతమాకుల పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ బాబు (19) ప్రేమించాడు.  

వీరిద్దరూ గత రెండు నెలల క్రితం ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమ వివాహం చేసుకున్నారు.  అయితే వీరిద్దరూ మైనర్లు కావడంతో పెనుమూరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వీరిని పట్టుకున్న పోలీసులు వారిరువురి తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి, మైనర్లిద్దరినీ వారి వారి తల్లిదండ్రులకు అప్పగించారు.

కాగా, మంగళవారం మధ్యాహ్నం పెనుమూరు వద్ద సంత నుంచి తిరిగి వెడుతున్న గాయత్రిని ఢిల్లీ బాబు దారిలో కాపు కాచి ఆపాడు. ఆమె మీద దాడి చేసి కిరాతకంగా కత్తితో పలుమార్లు కడుపుపై కోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గాయత్రిని వేలూరు సిఎంసి తరలించి కేసు నమోదు చేశారు. యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.