ఆంద్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొందరు సీఎం జగన్ పట్ల వారి విధేయతను చాటుకున్నారు.

ఆంద్రప్రదేశ్ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త మంత్రులు సీఎం జగన్, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌లకు నమస్కారం చేశారు. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొందరు సీఎం జగన్ పట్ల వారి విధేయతను చాటుకున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన కాళ్లు మొక్కారు. గుడివాడ అమర్‌నాథ్ ప్రమాణ స్వీకారం తర్వాత సీఎం జగన్‌కు సాష్టాంగ నమస్కారం చేశారు. జోగి రమేష్ మొక్కాలపై కూర్చొని జగన్‌కు అభివాదం చేశారు. నారాయణ స్వామి సీఎం జగన్‌కు పాదాభివందనం చేశారు.

ముత్యాల నాయుడు మొక్కాలపై కూర్చొని జగన్ పట్ల విధేయతను చాటుకున్నారు. విడుదల రజినీ, ఉషా శ్రీ చరణ్ , సీదిరి అప్పలరాజు, మేరుగ నాగార్జునలు సీఎం జగన్ కాళ్లను మొక్కారు. ప్రమాణ స్వీకారం అనంతరం రోజా.. సీఎం వద్దకు ఆయన కాళ్లకు నమస్కారం చేశారు. అనంతరం ఆయన చేతిని ముద్దాడి విధేయతను చాటుకున్నారు. 

ఇక, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అక్షర క్రమంలో కొత్త మంత్రుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ చదివారు. ఆ ప్రకారం వారితో గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. తొలుత అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 

ఆ తర్వాత వరుసగా.. అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, బొత్స సత్య నారాయణ, బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్‌నాథ్, గుమ్మనూరు జయరాం, జోగు రమేష్, కాకాని గోవర్ధన్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్య నారాయణ, కె నారాయణ స్వామి, కేవీ ఉష శ్రీ చరణ్, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపే విశ్వరూప్‌, రాజన్న దొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజిని ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులుగ్రూపు ఫొటో దిగారు. 

ఈ కార్యక్రమానికి కొత్తగా ప్రమాణం చేస్తున్న మంత్రుల కుటుంబ సభ్యులు, పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు హాజరయ్యారు. అయితే మంత్రి పదవులు దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు.. ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.