రైతులకు రూ.2000 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వలేకపోయిందన్నారు మంత్రి కురసాల కన్నబాబు. జగన్ అధికారంలోకి రాగానే తొలి కేబినెట్ సమావేశంలోనే ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు.

చంద్రబాబు రుణమాఫీ సక్రమంగా చేయలేదని, ఇన్‌పుట్ సబ్సిడీలు ఇవ్వలేదని, రైతుల కోసం తెచ్చిన అప్పును వేరే పనులకు దారి మళ్లీంచారని కన్నబాబు ఆరోపించారు. పండించిన ధాన్యానికి రైతులు ఎదురుచూసే పరిస్థితి వచ్చిందంటే అది ఎవరి పాపమని మంత్రి ప్రశ్నించారు.

అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆపేస్తామని మాట్లాడుతున్నారని.. అయితే రైతు భరోసా పథకాన్ని అధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరంలోనే అమలు చేస్తామని జగన్ హామీ ఇచ్చారని అయితే రైతుల ఇబ్బందుల దృష్ట్యా ఈ ఏడాది అక్టోబర్‌లోనే అమలు చేస్తున్నారని వెల్లడించారు.

రుణమాఫీ చేయలేక బాండ్లు ఇచ్చిన చంద్రబాబు.. తప్పును కప్పిపుచ్చుకునేందుకు అన్నదాత సుఖీభవ పేరుతో వారి ఖాతాల్లో డబ్బులు ఎందుకు వేశారని కన్నబాబు ప్రశ్నించారు. రైతు భరోసా కార్యక్రమాన్ని కౌలు రైతులకు కూడా ఇవ్వాలని జగన్ నిర్ణయించారని వారికి కూడా రూ.12,500 ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రాయలసీమలో వేరుశెనగ విత్తనాల పంపిణీకి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు. మరో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు గజినీగా వ్యవహరిస్తారని ఎద్దేవా చేశారు.

అధికారం కోల్పోవడంతో ఆయనకు ఏమి అర్ధం కావడం లేదని.. సాగునీటి ప్రాజెక్టులు ఆపేస్తున్నారని మాట్లాడుతన్నారని.. వీటిని ఆపేస్తున్నట్లు ఎవరు చెప్పారని అనిల్ కుమార్ ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా పారదర్శకమైన టెండరింగ్ విధానాన్ని జగన్ తీసుకొస్తున్నారని మంత్రి తెలిపారు. అవినీతి, దోపిడి బయటకొస్తాయనే భయంతో చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.