తాడేపల్లి: దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దళితులపై దాడుల విషయంలో సీఎం జగన్ స్పందించినంత త్వరగా ఎవరు స్పందించలేదని మంత్రి విశ్వరూప్ పేర్కొన్నారు. ఏపీలో దళితులపై దాడులు చేసిన వారిపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది చర్యలు తీసుకుందని.... దళితుల దాడులు చేసిన వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపిందని అన్నారు. 

''రాజమండ్రి బాలికపై అత్యాచార సంఘటనలో నిర్భయ, ఎస్సి ఎస్టీ కేసు పెట్టాము. దిశ చట్టం కింద కేసు పెట్టాల్సిందని అంటున్నారని... అయితే ఆ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపామన్న విషయం గుర్తుంచుకోని ఈ డిమాండ్ చేస్తే బావుండేది'' అని అన్నారు. 

''హర్షకుమార్ ఎంపీగా పోటీ చేస్తే పది వేల ఓట్లు కూడా రాలేదు. ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే 600 ఓట్లు వచ్చాయి. హర్షకుమార్ ఎజెండా దళిత ఎజెండా కాదు... చంద్రబాబు, అమరావతి ఎజెండా. దళిత యువకుడు ప్రసాద్ రాష్ట్రపతికి లేఖ వెనుక హర్ష కుమార్ ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి దయవలనే హర్షకుమార్ ఎంపీ అయ్యారు. ఇప్పుడు దళితులను మాస్క్ లాగా వాడుకుంటున్నారు'' అని ఆరోపించారు. 

''టీడీపీ హయాంలో దళితుల నేతల, అంబేద్కర్ విగ్రహాలను తొలగిస్తే ఇదే హర్షకుమార్ ఎందుకు నోరు మెదపలేదు. దళితుల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదు. దళిత అభివృద్ధిపై చర్చకు మేము సిద్ధం'' అని అన్నారు. 

''అమరావతికి దళిత సమస్యలకు సంబందం ఏమిటి. చంద్రబాబు ఎజెండాని హర్షకుమార్ మోస్తున్నారు. ఆయన వెనుక చంద్రబాబు ఉన్నారు. హర్షకుమార్ ను నడిపిస్తుంది చంద్రబాబు నాయుడే. దళితులను ప్రభుత్వానిక దూరం చేయాలనే చంద్రబాబుతో కలిసి హర్షకుమార్ కుట్ర చేస్తున్నారు'' అని ఆరోపించారు. 

''ఎంపీ ఎమ్మెల్యే సీటు కోసం చంద్రబాబు కాళ్ళు పట్టుకున్న వ్యక్తి హర్షకుమార్. ఆయన ఒక బ్లాక్ మెయిలర్. పది వేల ఓట్లు తెచుకోలేని హర్షకుమార్ సీఎం జగన్ ను విమర్శించే అర్హత లేదు. ప్రభుత్వంపై బురద జల్లడమే హర్షకుమార్ పని. టీడీపీ హయాంలో ఎన్నో సందర్భాల్లో దళితులపై దాడులు జరిగాయి.ఆ దాడుల సమయంలోనూ వర్ల రామయ్య కూడా నోరు మెడపలేదు'' అని అన్నారు. 

''దళిత పక్షపాతి జగన్మోహన్ రెడ్డి దళితులకు ఒక ఉప ముఖ్యమంత్రి, ఐదు మంత్రి పదవులు ఇచ్చారు. పప్పు బెల్లాల పేటెంట్ చంద్రబాబుదే. వైస్సార్ చేయూత ద్వారా బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎంతో మేలు చేశారు. హర్షకుమార్ ను ప్రజలు జోకర్ గా చూస్తున్నారు'' అని మంత్రి విశ్వరూప్ మండిపడ్డారు.