తిరుమల: శ్రీవారి ఆభరణాలపై అనుమానాలు ఉన్నాయని ఏపీ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు చెప్పారు.  ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత టీటీడీ అధికారులపై ఉందని  ఆయన అభిప్రాయపడ్డారు.

బుధవారం తెల్లవారుజామున  తిరుమల వెంకన్నను దేవాదాయ శాఖ మంత్రి  వెల్లంపల్లి శ్రీనివాసులు  దర్శించుకొన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత  వెల్లంపల్లి శ్రీనివాసులు  తొలిసారిగా తిరుపతి వెంకన్నను దర్శించుకొన్నారు.

ప్రస్తుతం ఉన్న టీటీడీ పాలకవర్గాన్ని ఆర్డినెన్స్‌ ద్వారా తొలగిస్తామని ఆయన స్పష్టం చేశారు.  శ్రీవారి ఆభరణాల భద్రతను సమీక్షించనున్నట్టు తెలిపారు. టీటీడీలో తలెత్తిన అన్ని వివాదాలపై  విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకొంటామన్నారు.

రమణ దీక్షితులు, వంశపారంపర్య అర్చకుల ఇబ్బందులపై పరిశీలించి చర్యలు తీసుకొంటామని  ఆయన చెప్పారు.  టీటీడీకి చెందిన బంగారం తరలింపుపై విచారణ చేస్తామన్నారు. బంగారం తరలింపుపై ఆరోపణలు నిజమైతే చర్యలు తప్పవన్నారు. భక్తుల కానుకలతో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.