వాలంటీర్ల సంగతేంటో తేల్చండి.. చర్యలకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం
‘‘ఇప్పటిదాక లక్షా 9వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అలా రాజీనామా చేసిన వాలంటీర్లు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేయలేదు. వారి సంగతేంటి’’ అని అధికారులను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అమలుకు ఆమోదం తెలిపింది. వాటిని వెంటనే అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల (జూలై) ఒకటో తేదీనే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామ, వార్డు సచివాలయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. జూలై ఒకటో తేదీన జరిగే పింఛన్ల పంపిణీలో ఎలాంటి జాప్యం జరగడానికి వీల్లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో పింఛన్ల పంపిణీపై మార్గనిర్దేశం చేశారు. సచివాలయ ఉద్యోగులంతా పింఛన్ల పంపిణీలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఊరికి దూరంగా ఉన్న సచివాలయాలపై నివేదిక...
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల నేపథ్యంలో పలువురు గ్రామ, వార్డు వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు. ఈ క్రమంలో పలువురు రాజీనామాలు చేశారు. ఇప్పటిదాక లక్షా 9వేల మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అలా రాజీనామా చేసిన వాలంటీర్లు సెల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేయలేదని... వారి సంగతేంటని అధికారులను మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రశ్నించారు. అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చాలాచోట్ల గ్రామ, వార్డు సచివాలయ భవనాలు ఊరికి దూరంగా, ప్రజలకు ఏవిధంగానూ అందుబాటులో లేకుండా ఉండటంతో అవన్నీ అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని... అలాంటి వాటిపై వెంటనే సమగ్ర నివేదిక ఇవ్వాలని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధికారులను కోరారు.
అలసత్వం వహిస్తే చర్యలు..
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులందరి సెలవుల మంజూరుపై ఒక కచ్చితమైన విధానాన్ని రూపొందించాలని మంత్రి తెలిపారు. సచివాలయాలు జారీ చేసే సర్టిఫికెట్లు, ఇతర సర్వీసు పత్రాలపై పాత లోగోలు లేకుండా జాగ్రత్త పడాలని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎక్కడైనా అలసత్వం వహించినట్టు తెలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే, సచివాలయ భవనాలపై గత ప్రభుత్వ లోగోలు, ఫోటోలు తొలగించి.. వాటి స్థానంలో రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని ఉంచాలని సూచించారు.
రాష్ట్రంలో చాలా చోట్ల గ్రామ సచివాలయాలకు, పంచాయితీలకు మధ్య సమన్వయం లేదని మంత్రి బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం.. ఇతర శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులను సైతం సంప్రదించి, అవసరమైతే ఒక కమిటీ వేసుకుని సమన్వయాన్ని సాధించాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయాల రోజువారీ వ్యవహారాలను పరిశీలించేలా మండల స్థాయిలోనే ఒక అధికారికి బాధ్యతలు అప్పజెప్పే దిశగా కూడా ఆలోచనలు చేయాలని మంత్రి ఆదేశించారు. రక్త హీనత, పోహకాహార లోపం, బడి బయటి పిల్లలు, పాఠశాలల్లో మౌలిక వసతుల్లాంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై దృష్టి పెట్టి పురోగతి సాధించాలని స్పష్టం చేశారు.