భువనేశ్వరికి సెన్స్ ఉందా?.. తర్వాత అరెస్ట్ అయ్యేది లోకేష్, అచ్చెన్నాయుడు: మంత్రి రోజా సంచలనం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఏపీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి దేవుడిని వేడుకోవటం ఏమిటని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులపై ఏపీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు లేకపోతే కేసు నిలబడదని అన్నారు. కేసు నమోదు చేసిన తర్వాత విచారణలో చాలా పేర్లు, వివరాలు బయటకు వస్తాయని అన్నారు. చంద్రబాబు మీద కక్ష సాధించాలంటే సీఎం జగన్ నాలుగేళ్లు ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు తప్పు చేసి దొరికిపోయాడని.. అందుకే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు.
చంద్రబాబు భార్య భువనేశ్వరికి సెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి దేవుడిని వేడుకోవటం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌పై భువనేశ్వరి, బ్రాహ్మణికి ఎలాంటి బాధ లేదన్నారు. ఎన్టీఆర్‌ను పొట్టనబెట్టుకున్నప్పుడే ఆయన కూతుళ్లుకు, కుటుంబానికి బాధ లేదని విమర్శించారు. ఎన్టీఆర్ కుమార్తెలకు తన తండ్రిని హిసించినా ఎటువంటి ఎమోషన్స్ లేవని అన్నారు. నాడు ఎన్టీఆర్ ను వేధించిన వ్యక్తిని ఇప్పుడు విధి సమాధానం చెప్పిందని రోజా చెప్పుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తోందని అన్నారు.
లోకేష్, ఆయన స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ముందే చెప్పామన్నారు. చంద్రబాబు విషయంలో సొంత కొడుకు కంటే ఎక్కువగా పవన్ కల్యాణ్ స్పందిస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబును అరెస్ట్‌పై ప్రజలు హ్యపీగా ఫీలవుతున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన వెంటనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి బావను కాపాడుకోవటానికి పార్టీని తాకట్టుపెడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అందరి కాళ్లు పట్టుకొని కేసుల నుంచి బయట పడుతున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎక్కడా రాజీ పడలేదన్నారు. అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగినప్పుడే ఆయనపై పైన సానుభూతి రాలేదన్నారు. చంద్రబాబు జైలులోకి వెళ్లిన తర్వాత అరెస్ట్ అయ్యేది లోకేశ్, అచ్చెన్నాయుడులే అంటూ సంచలన కామెంట్స్ చేశారు.