చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లపై మంత్రి రోజా విరుచుకుపడ్డారు. అన్ స్టాపబుల్ గా చంద్రబాబు అబద్దాలు చెప్పాడంటూ విమర్శించారు.
తిరుపతి : మంత్రి రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనం సమయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తర్వాత ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం బయట మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధి అడ్డుకుంటున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై విమర్శలు గుప్పించారు. ఎన్నో దశాబ్దాలుగా రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడి ఉన్నాయన్నారు.
అందుకే మూడు రాజధానులు వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని సీఎం జగన్ నిర్ణయించారని మంత్రి రోజా అన్నారు. 58 సంవత్సరాలకు ముందే మనకి రాజధాని రావాల్సింది. కానీ, రాలేదు అని రోజా అన్నారు. నేడు సీఎం జగన్ ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాయలసీమ బిడ్డగా ఇక్కడ న్యాయ రాజధాని రావాలని కోరుకుంటున్నాను అని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు తన బినామీల కోసం నీఛ రాజకీయాలు చేస్తున్నారు.
కాళ్లు పట్టుకుంటే వినలేదని.. గొంతు పిసికి చంపేశాడు, ఆయన హీరో కాదు విలన్ : చంద్రబాబుపై అంబటి సెటైర్లు
చంద్రబాబు, రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులు కావాలని కోరుకుంటూ స్థానిక ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. పెయిడ్ ఆర్టిస్టులతో అమరావతిలోనే రాజధాని నిర్మించాలని నీఛ రాజకీయాలు చేస్తున్నారు. నిజమైన రైతులకు రైతు కష్టం తెలుస్తుంది.. కేవలం స్వార్ధంతో కూడిన పాదయాత్ర అంటూ అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రను రోజా కొట్టిపారేశారు.
పవన్ కల్యాణ్ కుప్పిగంతులు, పిచ్చి గెంతులు ఎవరూ పట్టించుకోరని.. ఎన్నో వేల పుస్తకాలు చదివాను అని చెప్పుకునే పవన్.. ఉత్తరాంధ్ర కష్టాలు ఎప్పుడూ చదవలేదా అని ప్రశ్నించారు. అన్ స్టాపబుల్ గా చంద్రబాబు అబద్ధాలు చాలా బాగా చెప్పారు అని రోజా విమర్శించారు. ఎన్టీఆర్ మరణానికి కారణమైన చంద్రబాబు, ఆయనను ఆరాధ్యదైవం అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబునాయుడు సీఎం కావడానికి కారణం కుప్పం ప్రజలు, కానీ కుప్పానికి ఏమీ చేయలేదని మంత్రి రోజా దుయ్యబట్టారు.
