ఆసియా క్రీడల్లో అదరగొట్టిన ఆంధ్రా కుర్రాడు... జగన్ సర్కార్ భారీ నజరానా
చైనాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్ 2023 లో పతకం సాధించిన ఏపీ కుర్రాడు సాకేత్ కు జగన్ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది.

విజయవాడ : చైనా వేదికన జరుగుతున్న ఆసియా క్రీడలు 2023 లో భారత్ పతకాల పంట పండించింది. టెన్నిస్ పురుషుల డబుల్స్ లో సాకేత్ మైనేని, రాజ్ కుమర్ రామనాథన్ రజతపతకం సాధించారు. అయితే వీరిలో సాకేత్ ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవాడు. దీంతో అతడికి ఏపీ ప్రభుత్వం అభినందించడంతో పాటు భారీ నజరానా ప్రకటించింది.
చైనా గడ్డపై భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన క్రీడాకారుల్లో ఏపీకి చెందినవారు కూడా వుడటం గర్వకారణమని క్రీడా శాఖ మంత్రి రోజా అన్నారు. సాకేత్ కు మరింత ప్రోత్సాహం అందించేందకు ప్రభుత్వ ఉద్యోగంతో పాటు టెన్నిస్ అకాడమీకి స్థలం కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫైల్ సిద్ధమైందని...క్యాబినెట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామన్నారు. ఎన్నికల లోపే సాకేత్ కు ఉద్యోగం, అకాడమీకి స్థలం అందజేస్తామని మంత్రి రోజా ప్రకటించారు.
క్రీడాకారులను కులం, మతం, పార్టీ ప్రాతిపదికన చూడకూడదని... అలా చూస్తే అవి ప్రభుత్వాలే కావన్నారు రోజా. దేశం కోసం కష్టపడి పతకాలు సాధించే క్రీడాకారులకు ప్రభుత్వాలు అండగా ఉండాలన్నారు. కానీ గత ప్రభుత్వంలో సాకేత్ ఎంతో నష్టపోయాడని అన్నారు. అలా కాకుండా క్రీడాకారులకు తమ ప్రభుత్వం పూర్తిగా అండదండలు అందిస్తుందని రోజా పేర్కొన్నారు.
Read More ఏషియన్ గేమ్స్ 2023: చెస్‌లో రెండు రజతాలు... ఆసియా క్రీడల్లో ఘనంగా ముగిసిన భారత్ క్రీడా ప్రస్థానం..
అద్భుత ప్రతిభ కలిగిన సాకేత్ మన రాష్ట్రానికి చెందిన వాడు కావడం గర్వకారణమని రోజా అన్నారు. దేశానికి పేరు తెచ్చేందుకు తన జీవితాన్ని పణంగా పెట్టిన అతడిని చూస్తే చాలా గర్వంగా ఉందన్నారు. సాకేత్ 2014లోనే గోల్డ్,సిల్వర్ మెడల్ సాధించారని... అతడి ప్రతిభను గుర్తించి 2017లో కేంద్రం అర్జున అవార్డ్ ఇచ్చిందన్నారు. కానీ గత ప్రభుత్వం అతడిని పట్టించుకోలేదని... అయినా అతడు కృంగిపోలేదని అన్నారు. ధైర్యంగా నిలబడి మరింత కసిగా ఆడాడని... దీంతో
చైనా గడ్డపై మరో అద్భుతం చేసాడని మంత్రి రోజా పేర్కొన్నారు.