2019 ఫలితమే 2024లో రిపీట్... విజయవాడ దుర్గమ్మ కృపతో మళ్ళీ జగనే సీఎం..: మంత్రి రోజా
శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా బాలాత్రిపుర సుందరి అలంకరణలో వున్న విజయవాడ దుర్గమ్మను మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మళ్లీ వైఎస్ జగన్ సీఎం కావాలని అమ్మవారిని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.

విజయవాడ : ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులతో పాటు విజయవాడ సిపి క్రాంతిరాణా టాటా దంపతులు కూడా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం... ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి దర్శనభాగ్యం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మంత్రులు, వీఐపిలతో పాటు సామాన్య భక్తులు ఇవాళ ఉదయం నుండి అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కె రోజా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు.
దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా బాలాత్రిపుర సుందరి అలంకరణలోని అమ్మవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించగా... అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అందించారు.
ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... ప్రతిసారి శరన్నవరాత్రుల సమయంలో అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. ఇలా గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమ్మవారిని దర్శించుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా.. వైసిపి అధికారంలోకి వచ్చేలా ఆశీర్వదించాలని కోరుకున్నట్లు రోజా తెలిపారు. అమ్మవారి కృపతో 2019 లో ఎన్నికల్లో తాను కోరుకున్నట్లే జరిగిందన్నారు. ఆ తల్లి అనుగ్రహంతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రజారంజక పాలన అందిస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.
అయితే వచ్చేఏడాది ఏపీలో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని... అందులోనూ వైసిపి గెలవాలని అమ్మవారిని కోరుకున్నానని రోజా తెలిపారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని... అమ్మవారి ఆశీర్వాదం కూడా అందుకు తోడవుతుందని అన్నారు. వైసిపి ప్రభుత్వానికి ఆశీర్వాదం... రాష్ట్ర ప్రజలపై చల్లనిచూపు వుండేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు రోజా తెలిపారు.
ఇక బాలాత్రిపుర సుందరీ దేవి అవతారంలోని విజయవాడ దుర్గమ్మను ఏపీ బిజెపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా దర్శించుకున్నారు. శరన్నవరాత్రి వేడుకల్లో మొదటిరోజయిన ఇవాళ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. శక్తి స్వరూపిణి, జగన్మాత ఆశీస్సులు ప్రజలందరిపై వుండాలని కోరుకున్నట్లు పురంధీశ్వరి తెలిపారు.