Asianet News TeluguAsianet News Telugu

పవన్‌ని పావుగా వాడుకుంటున్నారు.. ఎన్టీఆర్ ఫ్యామిలీని ఇలాగే : చంద్రబాబుపై రోజా తీవ్ర వ్యాఖ్యలు

జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పావులాగా వాడుకుంటున్నారని దుయ్యబట్టారు మంత్రి రోజా. గతంలో ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసిన ఘనత ఆయనదేనని రోజా ఎద్దేవా చేశారు. 

minister rk roja slams tdp chief chandrababu naidu
Author
First Published Nov 24, 2022, 6:59 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి రోజా. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌ని చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారని రోజా ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసిన ఘనత చంద్రబాబుదని ఆమె ఎద్దేవా చేశారు. కర్నూలులో వీధి రౌడీలా చంద్రబాబు ప్రవర్తించారని రోజా దుయ్యబట్టారు. బాబు, పవన్‌లు జగన్‌పై విషం చిమ్మి అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. వారిద్దరివి దిగజారుడు రాజకీయాలని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అంతకుముందు వచ్చే నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జరుగుతోన్న జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల్లో భాగంగా ఈ రోజు గుంటూరులో కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ముస్తఫా డప్పులు వాయించగా... రోజా ఆహుతుల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కళాకారులతో కలిసి స్టెప్పులు వేసి దుమ్ము రేపారు. దీంతో సభకు వచ్చిన వారంతా రోజా డ్యాన్స్‌ను తమ సెల్‌ఫోన్‌లో బంధించారు. 

ALso REad:నగరి వైసీపీలో రచ్చకెక్కిన విభేదాలు.. రోజా ప్రారంభించాల్సిన గ్రామ సచివాలయానికి తాళం

కాగా.. నగరి నియోజకవర్గ వైసీపీలో మంత్రి రోజాకి, అక్కడి స్థానిక వైసీపీ నేతలకు మధ్య పడటం లేదు. రోజా రెండవసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నగరి వైసీపీలో గ్రూపులు ఎక్కువయ్యాయి. జిల్లాకు చెందిన సీనియర్ మంత్రి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ఆమె పలుమార్లు వ్యాఖ్యానించారు. మంత్రి, ఎమ్మెల్యే అయిన తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయని రోజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాణాలకు తెగించి పార్టీ కోసం పనిచేస్తుంటే ప్రతిరోజూ మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని రోజా ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే టీడీపీ ఇక్కడ తిరిగి బలం పుంజుకునే అవకాశాలు వున్నాయంటూ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో నగరి పంచాయతీ తాడేపల్లికి చేరింది. గత నెలలో సీఎం జగన్‌ను కలిసిన రోజా.... నగరి పరిణామాలపై ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. చక్రపారెడ్డి, ఇతర అసమ్మతి గ్రూపుల వైఖరిని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios