గెలుపు ఓటములు.. ప్రజలు నిర్ణయించాల్సినవని.. గెలిచినంత మాత్రన హీరోలు అయిపోరని ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు.
గెలుపు ఓటములు.. ప్రజలు నిర్ణయించాల్సినవని.. గెలిచినంత మాత్రన హీరోలు అయిపోరని ఏపీ కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ తో పొత్తుతో టీడీపీ ఓటమి చవిచూసింది. ఈ నేపథ్యంలో.. ఏపీ మంత్రి పితాని స్పందించారు.
కేసీఆర్ ని ఏపీకి రావద్దని చంద్రబాబు ఎప్పుడూ అనలేదని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ తెలుగు రాష్ట్రాల్లో పోటీచేశారని.. పీవీ కర్ణాటకలో పోటీ చేసిన విషయాన్ని కూడా పీతాని గుర్తు చేశారు. టీడీపీకి తెలంగాణలో ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని.. అందుకే చేశారన్నారు.
పార్టీలు ఉండి కూడా కొందరు తెలంగాణలో పోటీచేయలేదని.. వైసీపీ, జనసేనలను ఉద్దేశించి విమర్శించారు. ఏపీలో ఉన్న పరిస్థితి వారికి తెలియకపోవచ్చని.. కుర్చీలు, ఆఫీసులు లేని స్థితిలో చంద్రబాబును ఆంధ్రా ప్రజలు ఎన్నుకున్నారన్నారు.
పార్టీలకు అతీతంగా, చంద్రబాబుపై విశ్వాసంతో ప్రజలు ఓట్లు వేసి గెల్పించారన్నారు. జాతీయ స్థాయిలో పరిణామాలను దృష్టిలో ఉంచుకొని బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు. అప్పుడు రాష్ట్రాన్ని విభజిస్తే.. కాంగ్రెస్ లో ఉండమని చెప్పి తాము టీడీపీలో కి వచ్చినట్లు వివరించారు. ఆనాడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం వల్ల ఎన్నో కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యయన్నారు.
కాంగ్రెస్ వ్యతిరేక భావాలతో పుట్టిన పార్టీలు టీడీపీ, బీజేపీ అన్నారు. ఈ రెండు కలిస్తే.. మంచి జరుగుతుందని భావించామని.. కానీ అది జరగలేదన్నారు. జాతీయ రాజకీయాల్లో ఉన్నది రెండు ప్రధాన పార్టీలేనని.. రెండింట్లో ఏదో ఒకదానితో చేయి కలపక తప్పదన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఎవరి వల్ల ఎవరు ఓడిపోయారనే విషయంపై తాను మాట్లాడనన్నారు. జాతీయ స్థాయిలో మాత్రం తాము కాంగ్రెస్ తో నే కలిసి ప్రయాణిస్తామన్నారు.
