అమరావతి:  ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఏం సహకారం అందిస్తున్నారో చెప్పాలని రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రశ్నించారు. రోజూ విమర్శలు చేయటం తప్ప ఆయనకు మరో పని లేకుండా పోయిందని... మతి తప్పి మాట్లాడటంలో చంద్రబాబు మందుబాబులను మించిపోయాడని విమర్శించారు. బహుశా ఇంట్లో ఆయనకు ఏవో సమస్యలు, ఒత్తిళ్ళు ఉన్నట్టున్నాయని.... కొడుకు, కోడలు నుంచి సతాయింపులు పెరిగినట్టు ఉన్నాయని ఎద్దేవా చేశారు.  లేకపోతే ఈ ఆపత్కాలంలో ఇంత దిగజారి ఎవరూ మాట్లాడరని అన్నారు. 

''కరోనాకు ఎటువంటి మందూ లేదని ఒకపక్కన వాదిస్తారు. మరోవంక మెడ్ టెక్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందంటారు. ఇంకోపక్కన మెడ్ టెక్ లో పరికరాలు నా వల్లే 
వచ్చాయంటారు. మరి మెడ్ టెక్ ను మేం నాశనం చేస్తే.. పది నెలల్లోనే పరికరాలు ఎలా బయటకు వచ్చాయి?'' అని ప్రశ్నించారు. 

'' ప్రభుత్వానికి తమవంతు సాయంగా దాతలు అందించే విరాళాలను కూడా తప్పుబడతారు. ఉద్యోగులు, కార్మికులు చూపే మానవతా సాయాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఏ ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి సహాయనిధికి ఇవ్వటం వీల్లేదనేది చంద్రబాబు అభిప్రాయం అని అర్థమవుతోంది. చంద్రబాబు మాత్రం కాటికి కాళ్ళు చాపే వృద్ధుల దగ్గర నుంచి.. బడిపిల్లల వరకూ ఎవరినీ వదిలిపెట్టకుండా జోలి పట్టి మరీ మహిళల మెడల్లో తాళ్ళు, చేతి గాజులతో సహా విరాళాల రూపంలో వసూలు చేశాడు.  ఆయన చేస్తే ప్రజా శ్రేయస్సు...! ఎదుటి వారు చేస్తే మాత్రం అక్రమం, అన్యాయం అని అరుపులా..!'' అని మండిపడ్డారు.

''కరోనా పరీక్షల గురించి తప్పుడు లెక్కలు  ఇచ్చామంటున్నారు. ఎందుకిలా మాట్లాడతారు చంద్రబాబూ..! దేశంలో కరోనా పరీక్షలు అత్యధికంగా జరిపిన నాలుగు, ఐదు రాష్ట్రాల్లో మనది కూడా ఒకటి.  రేపటి నుంచి వేల సంఖ్యలో, అంటే రోజుకు 10 వేల పరీక్షలు వరకూ చేయటానికి కావాల్సిన లక్ష కిట్లు ఈరోజు నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి విషయాల్లో కూడా ఇంత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు'' అంటూ చురకలు అంటించారు.  

''ఇక రాష్ట్ర ప్రభుత్వానికి గత ఏడాదితో పోలిస్తే.. మరో రూ. 30 వేల కోట్లు అదనంగా వచ్చిందని మీరు మాట్లాడుతున్నారంటే కనీసం నమ్మేవారు ఎవరైనా ఉంటారా?  మీ సైకాలజీ చూస్తే అందరికీ అర్థమయ్యేది ఏమిటంటే... రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం లేకపోయినా ఉందంటారు. విరాళాలు ఇవ్వొద్దు అంటారు. పేద పిల్లలకు ఇంగ్లీషు మీడియం వద్దంటారు.  దళితులకు, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి వీల్లేదని అడ్డుకుంటారు. అధికార వికేంద్రీకరణ జరగటానికి వీల్లేదని అడ్డుకుంటున్నారు. ఎస్సీ కార్పొరేషన్ల వర్గీకరణ జరగటానికి వీల్లేదన్నారు. ఇవన్నీ చూస్తే.. మీరు మానసికంగా చెడు జరిగితే ఆనందించే గుణం.. మంచి జరిగితే అడ్డుకునే గుణం.. రెండూ ఉన్నాయని అందరికీ అర్థమవుతోంది'' అంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 

''ఇంగ్లీషు మీడియాన్ని వ్యతిరేకించి.. ఇప్పుడు వ్యతిరేకించటం లేదని తడబడుతున్నారు.  ఇక మీ యనమల అయితే ఏకంగా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటాడు. నిజమే, మీ లాంటి వాళ్ళను లోపల పడేసేందుకు కరోనా సమయంలో ఇష్టం వచ్చినట్లు అబద్ధపు ప్రచారాలు చేసేవారిని 14 ఏళ్ళు జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్ తీసుకొస్తే బాగుంటుందని ప్రజలందరూ కోరుకుంటున్నారు'' అంటూ పేర్ని నాని చంద్రబాబుపైనే కాదు యనమలపైనా మండిపడ్డారు.