ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ పై మంత్రి పరిటాల సునీత సంచలన కామెంట్స్ చేశారు. జగన్‌పై జరిగిన దాడిని మంత్రి పరిటాల సునీత తోసిపుచ్చారు. జగనే కత్తితో పొడిపించుకున్నారని ఆరోపించారు. 

ఈ ఘటనపై అనవసరంగా గొడవలు చేసి.. ప్రభుత్వం, చంద్రబాబు విఫలమయ్యారంటూ నేరం మోపుతున్నారని వ్యాఖ్యానించారు. వాళ్ల ఉచ్చులో వాళ్లే పడ్డారన్నారు. ప్రజల కళ్లు గప్పి డ్రామాలాడాలంటే ఎవరూ నమ్మే స్థితిలో లేరని పేర్కొన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిటాల రవిని పట్టపగలే చంపించారన్నారు. తన భర్త ఎమ్మెల్యేగా చనిపోతే అప్పటి గవర్నర్ వచ్చి తనను పలకరించనే లేదని వాపోయారు. అప్పట్లో చంద్రబాబు ఒక్కరే మా కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తుచేశారు.
 
జగన్‌కు ఏపీ పోలీసులపై నమ్మకం లేదనడం బాధాకరమని చెప్పారు. 3వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా.. ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. అలాంటిది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్న ఎయిర్‌పోర్టులో దాడి జరిగితే ప్రభుత్వానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిజాలు తెలుసుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాట్లాడటం మంచిది కాదని హితవు పలికారు. ప్రమాదం జరిగిన వెంటనే విశాఖలో కేసు పెట్టకుండా హైదరాబాద్‌కు ఎందుకు వెళ్లిపోవాలని నిలదీశారు. అయినా ఇలాంటి ఘటనలు జరగకూడదని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.