గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఒక పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాదని మంత్రి నక్కా ఆనందబాబు స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతీసినందువల్లే ఆరోజు కాంగ్రెస్ పై పోరాడటం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ ఏ పని చేసినా దేశ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం బీజేపీ తెలుగు జాతిమీద దాడి, కుట్రలు చేస్తుందని అందువల్లే  చంద్రబాబు జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

కేంద్రంలో ఉన్న వ్యవస్థలన్నింటిని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతియ్యాలని బీజేపీ చూస్తుందని నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక భాగమే కాబట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కూడా కలిసినట్లు చెప్పారు.

చంద్రబాబు నాయుడు ఎదుగుదలను తట్టుకోలేక బీజేపీ వేధింపులకు పాల్పడుతుందని ఆరోపించారు. దేశంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిన నరేంద్రమోదీని గద్దెదింపడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అసహనంతో ఉన్నారన్నారు. 

ఐటీ దాడులు, ఈడీ దాడులతో అలజడులు సృష్టించి ఇబ్బందులకు గురిచేస్తున్న పార్టీ బీజేపీ అని విమర్శించారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, నరేంద్రమోదీలు దొంగకాపురాలు చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చెయ్యడానికి ప్రయత్నించడని ఆయనను ఎవరూ నమ్మలేదన్నారు.