Asianet News TeluguAsianet News Telugu

అక్టోబర్ లో ఆ కాలేజీలు ప్రారంభం...సెంచూరియన్ ప్రమాణాలతో: మంత్రి మేకపాటి

మంత్రి మేకపాటి అధ్యక్షతన శనివారం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్షా సమావేశం జరిగింది. 

minister mekapati goutham reddy review meeting on skill development colleges
Author
Amaravathi, First Published Jul 25, 2020, 6:38 PM IST

అమరావతి: అక్టోబర్ లో 5 నైపుణ్య కళాశాలలు లాంఛనంగా ప్రారంభించడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య, జౌళి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. చదువు విలువను ప్రపంచానికి చాటిన గాంధీ జయంతి రోజున స్కిల్ కాలేజీలకు శ్రీకారం చుట్టనున్నామని... ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా కడప, ఏలూరు, ఒంగోలు, అనంతపురం, నెల్లూరు జిల్లాలలో స్కిల్ కాలేజీలను ముందుగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.

మంత్రి మేకపాటి అధ్యక్షతన శనివారం నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులతో ఆయన వివిధ అంశాలపై చర్చించారు. 

అక్టోబర్ లో ప్రారంభించే 5 కాలేజీలు కాకుండా మరో 25 స్కిల్ కాలేజీలు కొత్త ఏడాది జనవరిలోనే లాంఛనంగా ప్రారంభించడానికి సన్నద్ధం అవుతున్నామన్నారు.  అనుకున్న సమయానికి అనుకున్నవి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. 30 కాలేజీలపై పర్యవేక్షణ కోసం  'ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్' ఏర్పాటుచేస్తున్నామన్నారు. 

అక్టోబర్ లో ప్రారంభించే 5 కాలేజీలు సహా అన్ని కాలేజీల డిజైన్లు, లేఔట్లకు తుది మెరుగులు దిద్దుతున్నామన్నారు. గతేడాది చివరిన నైపుణ్యశాఖ బృందం భువనేశ్వర్ లోని సెంచూరియన్ స్కిల్ యూనివర్సిటీ విజిట్ ను ప్రస్తావించిన మంత్రి గౌతమ్ రెడ్డి...రాష్ట్రంలో రానున్న స్కిల్ కాలేజీలలో సైతం 'సెంచూరియన్' స్థాయి ప్రమాణాలుండాలని దిశానిర్దేశం చేశారు.  స్కిల్ కాలేజీ ఆకృతులు, సైట్లకు సంబంధించిన వ్యవహారాలను ప్రత్యేక ఆర్కిటెక్ లు పరిశీలించనున్నారని పేర్కొన్నారు. 

ఆర్థికపరమైన ఇబ్బందులు రాకుండా సీఎస్ఆర్ నిధుల సమీకరణపై మరింత దృష్టి సారించాలని మంత్రి అధికారులకు సూచించారు. త్వరలో  స్కిల్ కు సంబంధించిన కోర్సులు, కరికులమ్ పై హై నెట్ వర్క్ ఇండస్ట్రీస్ వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. కొత్త కోర్సులు, ప్రాధాన్యత రంగాలపై టాప్ కంపెనీల నిపుణులు, విద్యావేత్తలతో చర్చించి ఆమోదం తెలపనున్నట్లు వెల్లడించారు. 

ఇప్పటికే కీలక రంగాలలో భవిష్యత్ లో యువతకు ఉద్యోగావకాశాలుండే 20 కోర్సులపై అధ్యయనం చేస్తున్నట్లు....హై లెవల్ కమిటీ , ఐఎస్బీ ఆధ్వర్యంలో ప్రపంచ స్థాయి నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన కోర్సులు, మానవవనరుల వివరాలపై సర్వేకు నైపుణ్యశాఖ సిద్ధమన్నారు. త్వరలోనే యాప్ ద్వారా సర్వే ప్రారంభించే అవకాశం వుందన్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నైపుణ్యాభివృద్ధి శిక్షణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి.అనంతరాము, ఉపాధి, శిక్షణ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు హాజరయ్యారు.  
 

Follow Us:
Download App:
  • android
  • ios