తిరుపతి ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్ధికి లక్ష ఓట్ల మెజారిటీ దాటితే ముఖ్యమంత్రి చొరవతో సూళ్లూరుపేట ఎమ్మెల్యేకి కేబినెట్‌లో అవకాశం రావొచ్చన్నారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.

సూళ్ళూరు పేట.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచే కంచుకోటన్నారు. తిరుపతి బై ఎలక్షన్ లో వైసీపీదే బావుటా అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రజల మనిషి, ప్రజల్లోనే ఉండే మనిషని గౌతం రెడ్డి ప్రశంసించారు.

సూళ్లూరుపేటలో వైసీపీ జెండా ఎగరాలంటే మంత్రులు రానక్కరలేదని.. ఇక్కడ ప్రజలు వైసీపీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. దొరవారిసత్రం మండలంలో ప్రతిపక్షాలు డిపాజిట్లు దక్కించుకోవడం కూడా కష్టమేనని మేకపాటి జోస్యం చెప్పారు.

గత ఎన్నికలలో ఈ మండలంలో 23,893 ఓట్లు పోలయ్యాయి, అందులో వైసీపీవే 15, 891 ఓట్లు పడ్డాయి. 6,290 ప్రతిపక్షాలకు వచ్చాయని మేకపాటి గుర్తుచేశారు.

సంక్షేమ పాలనకు నిలువుటద్దంలా ఉన్న తరుణంలో 4వేల ఓట్లు అటు ఇటు అయితే చాలని ఆయన అన్నారు. ప్రజల్లో ఉంటేనే ఓట్లు..ప్రజలకి మంచి చేస్తేనే మద్దతని మేకపాటి గౌతంరెడ్డి వ్యాఖ్యానించారు.