అమరావతి: ఆఫీస్, సంస్థ, పరిశ్రమలకు వెళ్లకుండానే ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించే 'రిమోట్ వర్క్' సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని  మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  ఆదేశించారు. పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ఉన్నతాధికారులతో పాటు ఐఎస్బీ సంస్థ ప్రొఫెసర్లతో మంత్రి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా 'రిమోట్ వర్క్' అవకాశాలకు అనువైన రంగాలను గుర్తించాలని మంత్రి మేకపాటి సూచించారు. 

పరిశ్రమలు, నైపుణ్య శాఖ, ఐఎస్బీ సమన్వయంతో ఉద్యోగాలు, పరిశ్రమలు, ప్రాంతాల వారీగా మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. 300 ఎమ్ఎస్ఎమ్ఈలలో తొలుత పైలట్ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రి పేర్కొన్నారు. ప్రాంతం, రంగం, ఉద్యోగాల అవకాశాలను తెలిపేలా పైలట్ ప్రాజెక్టు ఉండాలన్నారు.  కొన్ని కీలక అంశాలలో పీపీపీ మోడల్ తరహాలో పాలసీ ల్యాబ్ ఉండాలని మంత్రి మేకపాటి సూచించారు. 

ఇప్పటికే ఉన్న గణాంకాల వివరాలను బట్టి మరిన్ని ఉద్యోగాలను మ్యాచ్ చేసుకుంటూ వెళ్తే ఒక రూపం వస్తుందని పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇన్ ఫార్మల్ రంగంలో 2,400 కోర్సులను అందుబాటులోకి తెచ్చిందని ఈ సందర్భంగా ఏపీఎస్ఎస్డీసీ ఎండీ అర్జా శ్రీకాంత్ మంత్రి మేకపాటికి వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యువత ఆలోచనలు, పరిశ్రమలలో ఉద్యోగవకాశాలు సమతూకం చేయాలని మంత్రి ఉన్నతాధికారులతో  అన్నారు. 

ఆర్టీజీఎస్ ద్వారా ఈ అంశాలపై కొంత  సమాచారం అందించామని లోకేశ్వరరెడ్డి  ఐ.టీ సలహాదారు తెలిపారు. అంతకుముందు నైపుణ్యాభివృద్ధి , శిక్షణ శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధిలో భాగంగా  'ఆపరేషన్ మేనేజ్ మెంట్'పై  సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాముకి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాది, ఏపీఎస్ఎస్డీసీ ఛైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి, ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ, సీఈవో అర్జా శ్రీకాంత్, ఐ,టీ శాఖ సలహాదారులు విద్యాసాగర్ రెడ్డి, లోకేశ్వరరెడ్డి, నైపుణ్యాభివృద్ధి శాఖ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనుమ నాయక్, ఐఎస్ బీకి చెందిన ప్రొఫెసర్లు దీప మణి, శ్రీధర్ భాగవతుల, ప్రశాంత్ శ్రీవాత్సవ, చంద్రశేఖర్ శ్రీపాద, గురు, తదితరులు పాల్గొన్నారు.