జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. బౌన్సర్లతో, రాజకీయ కూలీలతో చేసేది పాదయాత్ర ఎలా అవుతుందని నారా లోకేష్‌ను కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించారు మంత్రి కొట్టు సత్యనారాయణ. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందన్నారు. కలిసి పోటీ చేయడం అంటే ఒంటరిగా పోటీ చేయలేం అనే కదా అని మంత్రి ప్రశ్నించారు. బౌన్సర్లతో, రాజకీయ కూలీలతో చేసేది పాదయాత్ర ఎలా అవుతుందని నారా లోకేష్‌ను కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. ఇందుకోసం రూ.250 కోట్లు ఖర్చు అయ్యిందని తెలుగుదేశం నేతలే చెబుతున్నారని.. వంద పుస్తకాలు పూర్తి అయ్యాయని మాలోకం అంటున్నాడని, రాష్ట్రంలోని అందరి పేర్లు రాసుకుంటున్నాడా అంటూ కొట్టు సత్యనారాయణ సెటైర్లు వేశారు. 

అంతకుముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై మండిపడ్డారు వైసీపీ నేత, ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణ మురళి. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను హత్య చేయడానికి లోకేష్ కుట్ర పన్నుతున్నారని.. కోర్ట్‌కు హాజరయ్యేటప్పుడు తనను చంపాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. లోకేష్ తనపై రూ.4 కోట్లు పరువు నష్టం దావా వేశారని ఫైర్ అయ్యారు.

లోకేశ్ ఎవరిపై విమర్శలు చేయలేదా అని పోసాని ప్రశ్నించారు. లోకేష్‌పై పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్లు జైల్లో వుంటారని పోసాని హెచ్చరించారు. సీఎంపై ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేసిన లోకేష్‌పై పరువు నష్టం దావా వేయకూడదా అని పోసాని ప్రశ్నించారు. నాపై పాత కేసులు పెట్టి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కృష్ణమురళీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ALso Read: కోర్ట్ దగ్గర నా హత్యకు కుట్ర.. లోకేష్‌దే బాధ్యత : పోసాని సంచలన వ్యాఖ్యలు

హెరిటేజ్ అంటే చంద్రబాబు గుర్తుకొస్తారని.. మరి హెరిటేజ్ ఆస్తులు లోకేశ్‌కు చెందవా అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అక్రమాలు బయటపెట్టడంతో తనపై కక్షకట్టారని.. పుంగనూరులో పోలీసులపై కూడా హత్యాప్రయత్నం చేశారని పోసాని ఆరోపించారు. ఏ వ్యవస్థనైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబన్నారు. చంద్రబాబుపై ఎన్ని కేసులు వున్నా జైలుకు వెళ్లలేదని.. కొంతమందికి కులం పిచ్చి ఎక్కించి తనను తిట్టిస్తున్నారని పోసాని ఫైర్ అయ్యారు. 

కులాభిమానం వుండొచ్చు కానీ.. దురాభిమానం వుండకూడదన్నారు. గెలిచింది ఎవరైనా ప్రజలకు మంచి చేస్తున్నారా లేదా అనేది చూడాలని పోసాని కృష్ణమురళీ అన్నారు. రైతుల కష్టాలను తీర్చడానికి వైఎస్సార్ రూ.11 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేశారని ప్రశంసించారు. అమరావతిలో 5 శాతం భూములు పేదలకు ఇవ్వాలని చట్టంలో వుందని.. ఆ చట్టాన్ని చంద్రబాబు తుంగలో తొక్కారని పోసాని ఆరోపించారు.