సారాంశం

కాపులేమో పవన్ కల్యాణ్ సీఎం అవుతాడనుకుంటే ఆయనేమో పొత్తు నిర్ణయాలు తీసుకుంటున్నారని దుయ్యబట్టారు మంత్రి కొట్టు సత్యనారాయణ. వారాహి యాత్రలో పవన్ ఏం చెబుతారని మంత్రి నిలదీశారు. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మండిపడ్డారు మంత్రి కొట్టు సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపు సామాజిక వర్గాన్ని మరోసారి ముంచేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పవన్ అధికారంలోకి రావాలని కాపు వర్గంలోని యువత, పెద్దలు కోరుకుంటున్నారని మంత్రి తెలిపారు. కానీ పొత్తులతో పవన్ జనసేనను పాతాళానికి తొక్కేసారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. వారాహి యాత్రలో పవన్ ఏం చెబుతారని మంత్రి నిలదీశారు. పవన్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవచ్చని.. కానీ టీడీపీతో మాత్రం కలవొద్దని కాపులు కోరుకుంటున్నారని కొట్టు తెలిపారు. 

ALso Read: కత్తిపూడి జంక్షన్ నుండి పవన్ వారాహి యాత్ర: నాదెండ్ల మనోహర్

కాపు వర్గానికి చెందిన వ్యక్తికి తనకు తెలిసిన విషయాలను ప్రస్తావించానని కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. వారాహి యాత్రకు పవన్ కల్యాణ్ మూడు సార్లు బ్రేకులు వేశారని ఆయన చురకలంటించారు. బీజేపీతో, జనసేనతో కలిసినా చంద్రబాబుకు ఒరిగేదేం లేదని కొట్టు అభిప్రాయపడ్డారు. 2014లో ఇచ్చిన హామీలను ఆయన అమలు చేయలేదన్నారు. అలాగే ఇటీవల నిర్వహించిన రాజశ్యామల యాగంతో రాష్ట్రానికి మంచి జరుగుతోందని కొట్టు సత్యనారాయణ తెలిపారు. 

మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రపైనా రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన యాత్రతో తమకేం అభ్యంతరం లేదని.. కానీ పవన్ ఎంత వరకు తిరుగుతాడో నమ్మకం లేదంటూ సెటైర్లు వేశారు. తన కుమారుడి పాదయాత్ర కోసమే ఇంతకాలం పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు ఆపినట్లుగా తెలుస్తోందని ఆయన ఆరోపించారు. పాదయాత్రలో నారా లోకేష్ వివేకా అంశంపై ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు తల్లి గర్భంలోనే మానసిక వైకల్యం ఏర్పడిందేమో అంటూ సజ్జల దుయ్యబట్టారు.