Asianet News TeluguAsianet News Telugu

వైఎస్ జగన్ నే చంద్రబాబు ఫాలో ... నేటి కేబినెట్ భేటీలో ఆసక్తికర నిర్ణయాలు

ఆంధ్ర ప్రదేశ్ లో గత ఐదేళ్ల వైసిపి పాలనలో విధ్వంసకర పాలన సాగిందంటూనే జగన్ సర్కార్ చేసిన మంచి  పనులను కొనసాగించేందుకు సిద్దమయ్యింది కూటమి ప్రభుత్వం, అందులో భాగంగానే ఇవాళ్టి కేబినెట్ భేటీలో ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్నారు. అవేంటంటే.. 

Minister Kolusu Parthasarathy explained Cabinet Meeting decisions AKP
Author
First Published Jun 24, 2024, 5:28 PM IST | Last Updated Jun 24, 2024, 5:33 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వ ఏర్పాటుతర్వాత మొదటి కేబినెట్ భేటీ ఇవాళ జరిగింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ భేటీ దాదాపు మూడున్నర గంటలపాటు సాగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు మిగతా మంత్రులతో ఎన్నికల హామీలపై చర్చించిన సీఎం కొన్నింటి అమలుకు ఆమోదముద్ర వేసారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరిస్తూ చేసిన ఐదు సంతకాల ఫైళ్లకు కేబినెట్ ఆమోదం లభించింది. 

సీఎంగా చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సి పైనే... ఇప్పుడు కేబినెట్ భేటీలో మొదట చర్చ జరిగింది కూడా దీనిపైనే. మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇప్పటికే సీఎం చంద్రబాబు గ్నీన్ సిగ్నల్ ఇవ్వగా అందుకు మంత్రివర్గ ఆమోదం లభించింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,  ఫించన్ల పెంపు,అన్న క్యాంటీన్ల పునరుద్దరణ, స్కిల్ డెవలప్ మెంట్ లకు  కూడా మంత్రివర్గ ఆమోదం లభించింది. 

సామాజిక ఫించన్లపై కేబినెట్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్ జగన్ ఎలాగైతే ఫించన్ల పంపిణీ చేపట్టారో అదే విధానాన్ని కొనసాగించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్దమయ్యింది. జూలై 1 నుండి సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఫించన్ల పంపిణీ చేపట్టనున్నారు... ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుండే పెంచిన ఫించన్ అందించనున్నామని... అంటే వచ్చెనెల ఏడువేల ఫించన్ అందించనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. గతంలో జగన్ సర్కార్ కు  రూ.1000 ఫించన్ పెంచడానికి నాలుగేళ్ళు పట్టింది... చంద్రబాబు ప్రభుత్వం రెండు వారాల్లోనే పెంచి చూపించిందన్నారు. 

ఫెన్షన్ల పెంపు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 65  లక్షల మంది లబ్ది పొందనున్నారని మంత్రి తెలిపారు. వృద్దులు, ఒంటరి మహిళలకు రూ.3 వేల నుండి రూ.4వేలకు, దివ్యాంగులకు రూ.3  వేల నుండి రూ.6 వేలకు, పూర్తి అంగవైకల్యం వుంటే రూ.3వేల నుండి రూ.15 వేలు, ధీర్ఘకాలక వ్యాదులతో బాధపడేవారికి రూ.5 వేల నుండి రూ.10 వేలకు పెన్షన్ అందించనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ప్రతిఏటా రూ.23 వేల కోట్లను సామాజిక ఫెన్షన్ల కోసం ఖర్చే చేస్తే ఇకపై రూ.33వేల కోట్లకు పైగా ఖర్చు చేయనున్నట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. 

 

 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపైనే కాదు పాలనాపరమైన వ్యవహారాలపైనా చర్చించిన మంత్రిమండలి  కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి  పార్థసారథి అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో వుండేలా  చంద్రబాబు కేబినెట్ నిర్ణయాలున్నాయి. గంజాయి నివారణకు హోంమంత్రి అనిత సారథ్యంలో మొత్తం ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు... ఇందులో నారా లోకేష్ కూడా వున్నారు. గంజాయా, మాధద్రవ్యాల విషయంలో సీఎం చంద్రబాబు చాలా సీరియస్ గా వున్నారని మంత్రి పేర్కొన్నారు. 

ఇక గత ఐదేళ్లు రాష్ట్రంలో జరిగిన ఆర్థిక,పాలనాపరమైన విధ్వంసాలను ప్రజలకు తెలియజేసేందుకు సిద్దమయ్యింది చంద్రబాబు సర్కార్. ఈ మేరకు పోలవరం ప్రాజెక్ట్, అమరావతి, విద్యుత్, పర్యావరణం, మద్యంతో పాటు ఆర్థిక శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.  
ఈ నెల 31 నుండి ఒక్కో అంశంపై శ్వేతపత్రం విడుదల చేయనున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios