Asianet News TeluguAsianet News Telugu

ఓటుకు నోటులో, ఇప్పుడు పరిషత్ ఎన్నికల్లో .. పారిపోవడం బాబు రక్తంలో జీర్ణించుకుపోయింది: కొడాలి నాని

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా దొరికారని.. పారిపోవడమనేది చంద్రబాబు రక్తంలో జీర్ణించుకుని పోయిందని కొడాలి నాని దుయ్యబట్టారు. 
 

minister kodali nani slams tdp chief chandrababu naidu
Author
Amaravati, First Published Sep 21, 2021, 4:53 PM IST

ప్రతిపక్షనేత, టీడీపీ అధినేత చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి కొడాలి నాని. మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిమ్మగడ్డను అడ్డం పెట్టుకొని చంద్రబాబు పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఇంటి నుంచి బయటకు రాకుండా ఎన్నికల్లో పాల్గొన్నారని కొడాలి నాని దుయ్యబట్టారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు దీవిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఎన్నికలను చంద్రబాబు బహిష్కరిస్తే.. టీడీపీ నుంచి గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు  ఎవరు అని కొడాలి ప్రశ్నించారు. గెలిచిన వారిలోంచే ఒకరిని టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

ఇప్పటికే చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయడం లేదని.. ఇకపై ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులు కూడా దొరకరని మంత్రి జోస్యం చెప్పారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని నాని హెచ్చరించారు. ఓడిపోతామని తెలిసే ఆ రోజు ఎన్నికలు వాయిదా వేయించారని మంత్రి గుర్తుచేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే ఆనాడు నిమ్మగడ్డ పనిచేశారని ఆయన ఆరోపించారు. నామినేషన్లు వేసిన తర్వాత బహిష్కరణ డ్రామాలు ఆడారని నాని ఎద్దేవా చేశారు. ప్రజలకు మేలు చేస్తామన్న నమ్మకంతోనే వైసీపీని గెలిపించారని ఆయన అన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా సీఎం జగన్‌ను ప్రజలు ఆదరిస్తున్నారని మంత్రి చెప్పారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు దొంగలా దొరికారని.. పారిపోవడమనేది చంద్రబాబు రక్తంలో జీర్ణించుకుని పోయిందని కొడాలి నాని దుయ్యబట్టారు. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ వారిని చంద్రబాబు సస్పెండ్ చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ప్రతిపక్షమనేది లేదని చంద్రబాబే స్వయంగా ఒప్పుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును నమ్ముకుంటే తెలంగాణలో టీడీపీకి పట్టిన గతే ఏపీలోనూ పడుతుందని కొడాలి నాని జోస్యం చెప్పారు.

అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. అటువంటి వ్యక్తిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి తెలిపారు. మళ్లీ నోరు జారితే తీవ్ర పరిణామాలుంటాయని కొడాలి నాని హెచ్చరించారు. సీఎం జగన్‌ను టీడీపీ నేతలు ఒక్క మాట అంటే ఊరుకునేది లేదని తాట తీస్తామన్నారు. పేదలు ఆర్ధికంగా, సామాజికంగా ఎదగాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నారని కొడాలి నాని గుర్తుచేశారు. ప్రతి పేదవాడి హృదయంలో జగన్ అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరని ఆయన స్పష్టం చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios