నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరో మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిపై మంత్రి బొత్స వ్యాఖ్యల్లో తప్పులేదని... పార్టీలో జరుగుతున్న చర్చనే బొత్స వెల్లడించారన్నారు.

అమరావతి నిర్మాణంలో జరిగిన అవినీతి, అక్రమాలపై చర్చ జరగాలన్నదే తన అభిప్రాయమని.... రాజధానిని తరలిస్తామని వైసీపీ ఎక్కడా చెప్పలేదని నాని స్పష్టం చేశారు.

టీడీపీ హయాంలో రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి రూ. కోట్లు దోచుకున్నారని.. తాము చేసిన అక్రమాలు బయటపడతాయనే టీడీపీ నేతలు గోల చేస్తున్నారని కొడాలి ఆరోపించారు.

రాజధానిని ప్రభుత్వం మార్చాలనుకుంటే.. తెలుగుదేశం నేతలు చేసే ఉద్యమాలు ఆపగలవా అని ప్రశ్నించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ రివర్స్ టెండరింగ్ వ్యవహారంపై హైకోర్టు స్టే తాత్కాలికమేనని నాని తెలిపారు.

ఈ వ్యవహారాన్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ధనాన్ని కాపాడటమే లక్ష్యంగా సీఎం జగన్... రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొచ్చారని... ఎన్ని అడ్డంకులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదన్నారు.