టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై గుడివాడలో పోటీ చేసి గెలవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ పార్టీ కాదని.. అలా అని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని నాని అన్నారు.  

అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే వికేంద్రీకరణ చేస్తున్నట్లు చెప్పారు మంత్రి కొడాలి నాని (kodali nani) . అసెంబ్లీ సమావేశాలు (ap assembly) ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోనియా గాంధీని (sonia gandhi) ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టిన వ్యక్తి జగన్ (ys jagan) అని ప్రశంసించారు. సీఎం జగన్ వ్యాఖ్యలను టీడీపీ తప్పుదారి పట్టిస్తోందన్నారు. 16 నెలలు జైలులో వుండి కూడా.. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వున్నాడని కొడాలి నాని కొనియాడారు. 

ఎన్టీఆర్‌ను (ntr) వెన్నుపోటు పొడిచి .. ఆయన్ను సస్పెండ్ చేసి , ముఖ్యమంత్రి పదవిని, పార్టీని లాక్కొన్నారని ఆయన ఆరోపించారు. జగన్‌కు మీలాగా వెన్నుపోటు రాదని... ఎదుటి నుంచే గుండెలు చీలుస్తాడని నాని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి లోకేశ్ అని.. 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించిన జగన్‌కు నీకు పోలికా అంటూ మంత్రి ఫైరయ్యారు. గుడివాడలో తనపై పోటీ చేసి గెలవాలంటూ లోకేశ్‌కు (nara lokesh) నాని సవాల్ విసిరారు. వైఎస్ వివేకాను చంపి రాజకీయ లబ్ధి పొందాల్సిన అవసరం జగన్‌కు లేదని మంత్రి స్పష్టం చేశారు. 

సీఎం జగన్ అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును (chandrababu naidu) ఎక్కడా ఏకవచనంతో సంబోధించలేదన్నారు. శాసనసభకు చట్టాలు చేసే హక్కులు వున్నాయని.. మా పరిధి, పరిమితులు ఏంటో తమకు తెలుసునని.. ఏ వ్యవస్థలు ఇతర వ్యవస్థల్లోకి జోక్యం చేసుకోకూడదనే తాము చెప్పామని కొడాలి నాని అన్నారు. కొంతమంది వ్యక్తులు వ్యవస్థలను అడ్డుపెట్టుకుని.. వేరే వ్యవస్థల మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్నారని మంత్రి ఆరోపించారు. మూడు రాజధానులు, వికేంద్రీకరణ తమ సిద్ధాంతమని జగన్ స్పష్టం చేశారని నాని పేర్కొన్నారు. 

న్యాయస్థానాలపై అపారమైన నమ్మకం వుందని.. హైకోర్టు తీర్పుపై న్యాయ సలహా తీసుకుంటామని జగన్ చెప్పారని మంత్రి వెల్లడించారు. నాలుగు సార్లు పదో తరగతి తప్పి.. తాను ఎమ్మెల్యేను అయ్యానని, అమెరికాలో చదివి మంగళగిరిలో లోకేశ్ ఓడిపోయాడంటూ కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ ఖచ్చితంగా విశాఖ నుంచే పరిపాలన సాగిస్తారని మంత్రి స్పష్టం చేశారు. టీడీపీకి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా రాదని కొడాలి నాని జోస్యం చెప్పారు. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అని ఎన్నికల సంఘం చెబితే తాను రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతానని మంత్రి సవాల్ విసిరారు.