పోలవరం ప్రాజెక్ట్ గందరగోళానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడేనన్నారు మంత్రి కురసాల కన్నబాబు. అర్థరాత్రి పూట ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని ఆయన ఆరోపించారు.

పోలవరానికి సంబంధించి 2014 నాటి అంచనాలనే ఆమోదిస్తామని కేంద్రం చెప్పినప్పటికీ దానికి ఎలాంటి అభ్యంతరాలను కూడా గత ప్రభుత్వం చెప్పలేదని మంత్రి ఎద్దేవా చేశారు.

అప్పటి ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఈ విషయాన్ని లేవనెత్తినట్లు కన్నబాబు చెప్పారు. ఈ అంశాన్ని కూడా ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దేందుకు తాము ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

కేంద్రంతో సంప్రదింపులు జరిపే కార్యక్రమాన్ని వేగవంతం చేసినట్లు కన్నబాబు చెప్పారు. వర్షాలతో ఇప్పటి వరకు ముగ్గురు మరణించినట్లు ఆయన తెలిపారు. నివర్ తుఫానుపై కేబినెట్ సమావేశంలో చర్చించామన్నారు.

పోలవరానికి సంబంధించి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన, కేంద్ర జలశక్తి మంత్రితో అనిల్ కుమార్ యాదవ్ భేటీ అయ్యారని ఆయన తెలిపారు.

మరోవైపు డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 30.20 లక్షల మంది లబ్ధిదారులకు డీ ఫాం పట్టాలు ఇవ్వనుంది సర్కార్. 28.30 లక్షల మంది లబ్ధిదారులకు జగనన్న కాలనీల పేరుతో లే ఔట్ల అభివృద్ధి, ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఈ నెల 21 నుంచి భూముల రీ సర్వేకు కేబినెట్ ఓకే చెప్పింది. డిసెంబర్ 8న 2.49 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలు, మేకల పంపిణీ చేయనుంది.