తప్పు చేయలేదని చంద్రబాబు చెప్పడం లేదు.. స్కిల్ స్కాంలో పవన్‌కూ వాటాలు : కాకాణి గోవర్ధన్ రెడ్డి
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. కేసులో అవినీతికి పాల్పడలేదని , తాను ఎలాంటి తప్పూ చేయలేదని చంద్రబాబు చెప్పలేదని కాకాణి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు కూడా వాటాలు వున్నాయని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అరెస్ట్ చేశారని అన్నారు. 14 ఏళ్లు సీఎగా చేసిన వ్యక్తిని .. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో నిందితుడిగా న్యాయస్థానం నిర్ధారించిందని కాకాణి పేర్కొన్నారు.
టీడీపీ బంద్‌కు పిలుపునిస్తే ప్రజల నుంచి కనీసం స్పందన రాలేదని.. చంద్రబాబును అవినీతిపరుడిగా జనం నమ్ముతున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. లోకేష్ తన రెడ్ బుక్‌లో చంద్రబాబు పేరు రాసుకోవాలని గోవర్ధన్ రెడ్డి చురకలంటించారు. కేసులో అవినీతికి పాల్పడలేదని , తాను ఎలాంటి తప్పూ చేయలేదని చంద్రబాబు చెప్పలేదని కాకాణి పేర్కొన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కీం కేబినెట్ నిర్ణయమని.. తనకు సంబంధం లేదని చెబుతూ తప్పించుకునేందుకు యత్నిస్తున్నారని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు.
జగన్మోహన్ రెడ్డిని సంబంధం లేని కేసుల్లో ఇరికించారని.. అప్పుడు కూడా కేబినెట్ నిర్ణయాలేనని, ఆ సమయంలో జగన్ ఏ హోదాలోనూ లేరని కాకాణి గుర్తుచేశారు. అన్ని పథకాల్లోనూ చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని.. పవన్ కల్యాణ్ వచ్చి రోడ్డు మీద పడుకుని, ప్యాకేజీలు పంచుకున్నారని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో పవన్ కల్యాణ్‌కు కూడా వాటాలు వున్నాయని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో జనాన్ని తప్పుదోవ పట్టించారని.. తన అనుచరులతో భూములు కొని రాజధాని పెట్టించారని కాకాణి ఆరోపించారు.