రైతుల వద్ద నుంచి ప్రతి గింజా కొనుగోలు చేస్తామన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.  రాష్ట్రంలో ఒకేసారి 5 వేల ట్రాక్టర్లను రైతులకు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. రైతులపై పవన్, చంద్రబాబువి మొసలి కన్నీరేనని కాకాణి దుయ్యబట్టారు. 

మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా నెల్లూరుకు వచ్చిన ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ అంటే ఎంతో కీలకమన్నారు. 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడ్డారని.. రైతులు పండించే ప్రతిగింజ కొనుగోలు చేస్తామని కాకాణి తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని.. రాష్ట్రంలో ఒకేసారి 5 వేల ట్రాక్టర్లను రైతులకు ఇస్తామని గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. రైతులపై పవన్, చంద్రబాబువి మొసలి కన్నీరు అని కాకాణి ఎద్దేవా చేశారు. పెండింగ్‌లో వున్న పనులను పూర్తి చేస్తామని గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు. 

ఇకపోతే.. ఆదివారం నెల్లూరులో (nellore) జరిగిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ (anil kumar yadav) సభలో తాజా మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి (kakani govardhan reddy) ఫోటో కనిపించలేదు. అలాగే తన ప్రసంగంలో ఎక్కడా కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరెత్తలేదు. జిల్లాలోని వైసీపీ నేతలందరికీ ధన్యవాదాలు తెలిపిన ఆయన.. కాకాణి, ఆనం వివేకానందరెడ్డి పేర్లు మాత్రం ఎత్తలేదు. జిల్లాలో వర్గాలే లేవని ఉన్నది ఒక్కటే వర్గం.. అది జగన్ (ys jagan) వర్గమన్నారు. ఈ ఆత్మీయ సభ ఎవరికీ పోటీ కాదని.. తనకు తానే పోటీ అని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. 

మరోవైపు మంత్రి కాకాణి మాత్రం.. అనిల్ కుమార్ సభను తనకు పోటీ కార్యక్రమంగా భావించడం లేదన్నారు. అనిల్ కార్యకర్తల సమావేశం నిర్వహించుకుంటున్నారని చెప్పారు. జిల్లాలో సీనియర్లు, జూనియర్లు అందరినీ కలుపుకుని వెళ్లి.. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధించేందుకు కృషి చేస్తానని చెప్పారు కాకాణి. బలప్రదర్శనలు కాదంటూనే నెల్లూరు బలప్రదర్శనలు చేశారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ కుమార్ వర్గాలు. వర్గాలు లేవన్నా ఇద్దరి మధ్యా విభేదాలు స్పష్టంగా కనిపించాయి. తనకు ఎవరూ పోటీ కాదని అనిల్ అంటే.. అందరినీ కలుపుకుని వెళ్తానన్నారు కాకాణి. 

అంతకుముందు ఆత్మీయ సభలో అనిల్ కుమార్ మాట్లాడుతూ... నెల్లూరు జిల్లాలో వర్గాలు వుండవని.. వున్నది జగన్ (ys jagan) వర్గం ఒక్కటేనన్నారు. తనతో పాటు ఏ నాయకుడైనా జగన్ బొమ్మతోనే గెలుస్తారని అనిల్ వ్యాఖ్యానించారు. తాను తలపెట్టిన చిన్న చిన్న పనులను ఈ ఏడాదిలోగా పూర్తి చేస్తానని అనిల్ కుమార్ హామీ ఇచ్చారు. వాళ్లిద్దరూ కట్టకట్టుకుని వచ్చినా.. సింగిల్‌గా వచ్చినా జగనే సీఎం అంటూ పరోక్షంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లపై సెటైర్లు వేశారు. తాను ఎవరికీ పోటీ కాదని.. తనకు తానే పోటీన అని ఆయన అన్నారు. ఎవరికీ బలనిరూపణ చేయాల్సిన అవసరం లేదని అనిల్ కుమార్ స్పష్టం చేశారు. 2024లో మళ్లీ గెలుస్తామని.. మంత్రులుగా వస్తామని ఆయన జోస్యం చెప్పారు. 

సీఎం వైఎస్ జగన్ రుణం ఈ జన్మకు తీర్చుకోలేనన్నారు. జగన్ వెంట ఓ సైనికుడిలా నడుస్తానని స్పష్టం చేశారు. జగన్ వెంట కసితో ప్రయాణం చేశానని అనిల్ కుమార్ అన్నారు. జగన్‌ను అభిమానించే ప్రతి గుండె తనను రెండుసార్లు గెలిపించిందని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి పదవి ఇచ్చినప్పుడే రెండున్నరేళ్లు వుంటుందని జగన్ ముందే చెప్పారని అనిల్ కుమార్ గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ నిత్యం ప్రజల్లో వుండే అవకాశాన్ని జగన్ కల్పించారని అన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి 2024లో మళ్లీ జగన్‌ను గెలిపిస్తామని అనిల్ స్పష్టం చేశారు. మంత్రిగా వుండటం కంటే జగన్ సైనికుడిగా వుండటమే ఇష్టమని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఎన్నికల్లో వైసీపీకి ఘనమైన విజయం అందించారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తన వెంట నడిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. మొదటి దఫాలోనే మంత్రిని అవుతానని అనుకోలేదని అనిల్ పేర్కొన్నారు.