సెల్ఫీ ఛాలెంజ్‌కు తాము సిద్ధమన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి . చంద్రబాబు హయాంలో నీరులేక వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయిందని కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్‌పై స్పందించారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి . శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సెల్ఫీ ఛాలెంజ్‌కు తాము సిద్ధమన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఏపీలో వ్యవసాయాభివృద్ధి జాతీయ స్థాయి కంటే ఎక్కువగా వుందని ఆయన పేర్కొన్నారు. పౌల్టీ రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ ముందంజలో వుందన్నారు. చంద్రబాబు హయాంలో నీరులేక వేలాది ఎకరాల్లో పంట ఎండిపోయిందని కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.
చంద్రబాబు హయాంలో 16 వందల ఎకరాలను కరువు మండలాలుగా ప్రకటించారని.. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క కరువు మండలం కూడా లేదని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు సంవృద్ధిగా కురుస్తున్నాయని.. చంద్రబాబు వచ్చి వైసీపీ నేతలను తిట్టి వెళ్లారని కాకాణి గోవర్థన్ రెడ్డి దుయ్యబట్టారు. రైతులు పండించిన ధాన్యానికి మంచి ధర వస్తోందని.. దీనిని చూసి సోమిరెడ్డి తట్టుకోలేకపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో టీడీపీ బలహీనంగా వుందని.. ప్రజలకు సేవ చేయకుండా మీడియా ద్వారా వ్యతిరేకత తీసుకొచ్చేందుకు కుట్రలు చేస్తున్నారని కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు.
Also Read: టిడ్కో ఇళ్లపై జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్.. మంత్రి కాకాణి కౌంటర్
అంతకుముందు పేదలకు పక్కా ఇళ్ల పంపిణీకి సంబంధించి ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సవాల్ విసిరారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం నెల్లూరులో పర్యటించిన ఆయన మార్గమధ్యంలో అక్కడి టిడ్కో ఇళ్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. అనంతరం ఇళ్లతో సెల్ఫీ దిగారు. అనంతరం ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. సీఎం జగన్‌కు సవాల్ విసిరారు. ‘‘చూడు .. జగన్ ఇవే టీడీపీ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది ఇళ్లు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు.. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని..? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ..? జవాబు చెప్పగలవా..?’’ అంటూ ఛాలెంజ్ విసిరారు.
అయితే దీనికి ఆ వెంటనే మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కౌంటరిచ్చారు. చంద్రబాబు నాయుడు సంగం బ్యారేజ్ వద్దకు వచ్చి చూడాలని సలహా ఇచ్చారు. రాష్ట్రానికి పట్టిన శని చంద్రబాబేనని.. ఈ విషయాన్ని ఎన్టీఆరే స్వయంగా చెప్పారని మంత్రి చురకలంటించారు. శని కన్నా నువ్వు పెద్ద గ్రహనివని.. కరువు కాటకాలకు చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కరువే తాండవించిందని కాకాణి ఎద్దేవా చేశారు.
వాలంటీర్ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని.. అలాంటి వ్యవస్థపై విష ప్రచారం చేస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా నీ పక్కనే వుంటే.. 2019లో ఎందుకు ఓడిపోయావ్ అని ఆయన ప్రశ్నించారు. అన్ని సంతోష సూచికలు బాగుంటే నీ కొడుకు ఎందుకు ఓడిపోయాడంటూ మంత్రి వ్యాఖ్యానించారు. పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత వాలంటీర్ వ్యవస్థది కాదా అని గోవర్ధన్ రెడ్డి నిలదీశారు.
