Asianet News TeluguAsianet News Telugu

జగన్ పరమ భక్తుడికి టికెట్ లేనట్లే .. మహిళా నేతకు బంపర్ ఆఫర్

జగన్ వీరవిధేయుడు, అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జోగి రమేష్‌కు ఈసారి టికెట్ దక్కే అవకాశాలు  కనిపించడం లేదు. కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికకు పెడన టికెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. 

minister jogi ramesh replaced by harika at pedana assembly constituency ksp
Author
First Published Dec 28, 2023, 6:14 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి చూపు ఏపీ ఎన్నికలపై పడింది. పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే అక్కడ ఎన్నికలు జరుగుతాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీలోని రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. వీరిలో అందరికంటే సీఎం జగన్ గేమ్ మొదలుపెట్టేశారు. గెలవరు అనుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలను నిర్ధాక్షిణ్యంగా పక్కనపెట్టేయడమో, వారి స్థానాలను మార్చడమో చేస్తున్నారు. బంధువులైనా, ఆప్త మిత్రులైనా సరే జగన్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడకుండా నో చెప్పేస్తున్నారు. టికెట్లు కోల్పోయే నేతలను క్యాంప్ ఆఫీస్‌కి పిలిపించి వారిని బుజ్జగించే పనిలో వున్నారు జగన్, ఇతర కీలక నేతలు. 

ఈ లిస్టులో జగన్ వీరవిధేయుడు, అత్యంత సన్నిహితుల్లో ఒకరైన జోగి రమేష్ పేరు కూడా వున్నట్లుగా మీడియాలో కథనాలు వస్తున్నాయి. జగన్‌పై ఈగ వాలినా శివాలెత్తిపోయే మంత్రి జోగి రమేష్.. ప్రత్యర్ధులను అసభ్యపదజాలంతో దూషించడానికి కూడా వెనుకాడరు. గతంలో ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసంపైనా జోగి రమేష్ దాడికి యత్నించడం కలకలం రేగింది. అనంతరకాలంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో జోగి రమేష్‌కు మంత్రిగా అవకాశం కల్పించారు సీఎం వైఎస్ జగన్. దీంతో జోగి మరింత రెచ్చిపోయారు. బహిరంగ వేదికలపైనా, బయటా జగన్ నామస్మరణతో మోత మోగించేవారు. అలాంటి జోగి రమేష్‌కు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. ముఖ్యమంత్రితో తనకున్న సాన్నిహిత్యం , సామాజిక సమీకరణలతో తనకు టికెట్ పక్కా అని జోగి రమేశ్ విశ్వసించారు. కానీ పరిస్ధితులు అందుకు భిన్నంగా తయారయ్యాయి. 

కృష్ణా జిల్లా పెడన నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న జోగి రమేష్‌ పనితీరుకు సంబంధించి సీఎం జగన్ చేయించిన సర్వేలో ఆయన గ్రౌండ్ రిపోర్ట్ ఏమాత్రం ఆశాజనకంగా లేదట. జోగిపై జనాలు అంత ఆసక్తి చూపడం లేదని, పలు అంశాల్లో మైనస్‌లు వున్నాయని రిపోర్ట్ వచ్చిందట. అందుకే పెడనలో టికెట్ ఇవ్వకుండా విజయవాడ లోక్‌సభ అభ్యర్ధిగా పోటీ చేయించాలని వైసీపీ చీఫ్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అలా అని బెజవాడ పార్లమెంట్ టికెట్ అయినా ఖాయమేనా అంటే అది కూడా గ్యారంటీ అని చెప్పలేని పరిస్థితి. రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ వంటి విజయవాడ లోక్‌సభ టికెట్ కోసం వైసీపీలో భారీగా ఆశావహులు వున్నారు. 

మరోవైపు.. పెడనలో ఓ మహిళా నేతకు టికెట్ కన్ఫర్మ్ అయినట్లుగా వైసీపీలో ప్రచారం జరుగుతోంది. కృష్ణా జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారికకు పెడన టికెట్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. బీసీ నేత కావడంతో పాటు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా గుర్తింపు ఆమెకు కలిసొస్తుందని భావిస్తున్నారు. అలాగే హారిక అభ్యర్ధిత్వం పట్ల జగన్ చేయించిన సర్వే సైతం సానుకూలంగా వుందట. జెడ్పీ ఛైర్మన్‌గా అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ వ్యవహారాల్లో దూకుడుతో హారిక అధిష్టానం వద్ద మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే జోగికి బదులుగా ఉప్పాల హారికకు పెడన్ టికెట్ కన్ఫర్మ్ చేశారట జగన్. మరి తనకు అత్యంత ఆప్తుడు, నమ్మకస్తుడైన జోగి రమేష్‌ను ముఖ్యమంత్రి ఏ విధంగా సర్దుబాటు చేస్తారో చూడాలి. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios