చంద్రబాబు అరెస్ట్.. అది ఏపీలో రెండు పార్టీల గొడవ, బీఆర్ఎస్‌కేంటీ సంబంధం : హరీశ్ రావు
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో తెలుగు రాజకీయాలు వేడెక్కాయి. తాజాగా బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు . అసలు చంద్రబాబు అరెస్ట్‌తో మాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో తెలుగు రాజకీయాలు వేడెక్కాయి. ఏపీలో ఇప్పటికే టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. మరోవైపు తెలంగాణకు చెందిన పలు పార్టీల నేతలు కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ అగ్రనేత, మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు చంద్రబాబు అరెస్ట్‌తో మాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ అరెస్ట్ ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య జరుగుతోన్న గొడవగా తేల్చారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని హరీశ్ రావు అన్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్‌లపై ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను నమ్మే పరిస్ధితి లేదని.. ఇన్నేళ్లు ఆ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. బీజేపీకి రాష్ట్రంలో కేడర్ కూడా లేదని.. కుట్రపూరితంగానే కేంద్రం కవితకు నోటీసులు ఇచ్చిందని హరీశ్ వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే బీఆర్ఎస్‌ను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే బీజేపీ జమిలి నినాదం ఎత్తుకుందని.. జనాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్‌కు జమిలితో ఎలాంటి నష్టం లేదని హరీశ్ రావు తేల్చిచెప్పారు.
పనోళ్లు కావాలా, పగోళ్లు కావాలా అన్నది తేల్చుకోవాలని మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. పగవాడిలాగా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని.. ప్రతిపక్షాలు ప్రజలకు శత్రువుల్లాగా తయారయ్యారని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మాకొద్దని పాలమూరు ప్రజలు ఆలోచిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో నోబెల్స్‌కు గోబెల్స్‌కు మధ్య పోరని ఆయన అభివర్ణించారు. తాము చేయగలిగిందే చెప్పాం.. చెప్పినట్లు చేశామని హరీశ్ తెలిపారు. ప్రాజెక్ట్‌లకు విపక్షాలు అడ్డుపడుతున్నాయని.. పనిచేసేవారినే ప్రజలు గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు.