తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని గుర్తుచేస్తూ పవన్ కల్యాణ్ పై తీవ్రవ్యాఖ్యలు చేసారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కనీసం బర్రెలక్క స్థాయిలో కూడా జనసేన పోటీ పడలేకపోయిందని మంత్రి ఎద్దేవా చేసారు.
విశాఖపట్నం : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ పొలిటిషన్ కాదు... పక్కా పొలిటికల్ కాంట్రాక్టర్ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. జనసేన పార్టీకి ఓ సిద్దాంతం, విలువలు అనేవే లేవని అన్నారు. తెలంగాణలో బిజెపితో పొత్తు పెట్టుకుని చిత్తుగా ఓడిపోయారు... ఏపీలో మాత్రం టిడిపితో కలిసి పోటీచేస్తానని అంటున్నారు... ఇక్కడ కూడా తెలంగాణలో వచ్చిన ఫలితమే వస్తుందన్నారు. టిడిపి, జనసేన కూటమికి ఏపీలో ఓటమి తప్పదని అమర్నాథ్ అన్నారు.
తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి కుప్పం సొంత నియోకవర్గాలు.. అలా మీ సొంత నియోజకవర్గం ఏది? అంటూ పవన్ కల్యాణ్ ను మంత్రి ప్రశ్నించారు. ఎక్కడికి వెళితే అక్కడ ఇదే తన నియోజకవర్గం అని చెప్పుకుంటున్నాడని ఎద్దేవా చేసారు. అధికారికంగా బిజెపితో, అనధికారికంగా టిడిపితో జనసేన సంబంధం కలిగివుందని అమర్నాథ్ ఆరోపించారు.
అసలు ఆంధ్ర ప్రదేశ్ తో పవన్ కల్యాణ్ కు సంబంధం ఏమిటి? ఇక్కడ ఆయన ఎంతకాలం వున్నారు? అని మంత్రి ప్రశ్నించారు. హైదరాబాద్ లో స్థిరనివాసం కలిగిన పవన్ కు ఏపీ రాజకీయాలతో పనేమిటి... ఆయన కేవలం పొలిటికల్ టూరిస్ట్ మాత్రమేనని అన్నారు. అయినా మీరు నివాసముంటున్న తెలంగాణలోనే మీ బలమేంటో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బయటపడిందని అన్నారు. మీ శంకర్ గౌడ్ (తెలంగాణ జనసేన ఇంచార్జీ) కు ఎన్ని ఓట్లు వచ్చాయి? అంటూ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేసారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం బర్రెలక్క స్థాయిలోనే పవన్ కల్యాణ్ పోటీ పడ్డారు... జనసేన పార్టీకి వచ్చిన ఓట్లను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని మంత్రి అన్నారు. కొన్నిచోట్ల బర్రెలక్క స్థాయిలో కూడా జనసేన అభ్యర్థులు పోటీ ఇవ్వలేకపోయారని అన్నారు. కాబట్టి పవన్ పార్టీతో పోల్చడం బర్రెలక్కను కూడా తక్కవచేయడమే అవుతుందని అమర్నాథ్ అన్నారు.
తెలంగాణా ఫలితాలు చూసాక పవన్ కళ్యాణ్ మతి భ్రమించినట్టుంది... అందువల్లే నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. విశాఖ మేలుకోసం ఏమైనా చేస్తామని చెప్పుకునే మీరు ఎందుకు రాజధాని వస్తుంటే అడ్డుకుంటున్నారు? అని పవన్ ను ప్రశ్నించారు. ప్రపంచస్థాయిలో విశాఖను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ప్రయత్నిస్తుంటే టిడిపితో కలిసి పవన్ విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. విశాఖ వేదికగా సీఎం జగన్ పై పవన్ వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని... అయినా ఆయన చెప్పే అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ ప్రక్రియ తనవల్లే ఆగిందని పవన్ గొప్పలు చెప్పుకుంటున్నాడని మంత్రి గుర్తుచేసారు. కానీ వెయ్యి రోజులుగా కార్మికులు ఆందోళనలు కొనసాగుతున్నాయి... ఇవి కనిపించడం లేదా అంటూ నిలదీసారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడేందుకు వైసిపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని... అది పవన్ తో సాధ్యమయ్యేది కాదని మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
