ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరవుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఇప్పటివరకు 14 వేల రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా చెప్పారు.
ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు పెద్ద ఎత్తున ప్రతినిధులు హాజరవుతారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. ఇప్పటివరకు 14 వేల రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా చెప్పారు. సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధులు వారి రిజిస్ట్రేషన్లను పూర్తి చేసుకుంటున్నారని తెలిపారు. విశాఖపట్నంలో మార్చి 3,4 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తున్న నేపథ్యంలో.. ఇందుకు సంబంధించిన విశేషాల గురించి మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుకుని.. రేపు, ఎల్లుండి నిర్వహించనున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై పూర్తి స్థాయి సమీక్ష చేపట్టనున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఎంవోయూలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన ప్రతి పెట్టుబడి 80 శాతం రియలైజ్ కావాలని సీఎం జగన్ చెప్పారని అన్నారు. సీఎం జగన్‌కు ఉన్న క్రెడిబులిటీ బ్రాండ్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు రానున్నట్టుగా తెలిపారు. మార్చి 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రారంభ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఆ తర్వాత పలువురు పెట్టుబడి దారులతో సీఎం జగన్ సమావేశమవుతారని చెప్పారు. 150 పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి గడ్కరీ, సీఎం జగన్ ప్రారంభిస్తారని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలకు సాయంత్రం ప్రభుత్వం తరఫున డిన్నర్‌ను ఏర్పాటు చేయబోతున్నట్టుగా చెప్పారు. మార్చి 4వ తేదీన ఉదయం 9 గంటల నుంచే సమ్మిట్ కొనసాగుతుందని చెప్పారు.
గతంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాల కోసం పరిశ్రమల సదస్సు నిర్వహించింది. వచ్చిన పెట్టుబుల్లో కేవలం 8 శాతం మాత్రమే రియలైజ్ అయ్యాయని విమర్శించారు. తాము రాష్ట్ర ప్రయోజనాల కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నామని చెప్పారు. 2023 కొత్త ఇండస్ట్రీయిల్ పాలసీని కొత్త కంపెనీలకు అమలు చేస్తామని చెప్పారు. ఈసీ నుంచి అప్రూవల్ వస్తే కొత్త ఇండస్ట్రీ పాలసీని ప్రకటిస్తామని తెలిపారు.
టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్తలు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు హాజరవుతారని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు సీఎం జగన్ సమ్మిట్ పాల్గొంటారని చెప్పారు. ఇందుకోసం సీఎం జగన్ ఈరోజు సాయంత్రమే విశాఖపట్నం చేరుకుంటారని తెలిపారు. మార్చి 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమ్మిట్ ముగుస్తుందని చెప్పారు. అప్పటివరకు సీఎం జగన్ విశాఖలోనే ఉంటారని.. సమ్మిట్ ముగిసిన తర్వాత ఆయన తిరిగి బయలుదేరుతారని చెప్పారు. వాస్తవపెట్టుబడులే లక్ష్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతుందని చెప్పారు.
