తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన వెయ్యి కోట్లను జగన్ ఏపీలో జిల్లాల వారీగా పంచుతున్నారని ఆరోపించారు ఏపీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు.

విజయవాడలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన .. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 లలో సుమారు రూ.2 లక్షల కోట్ల ఆస్తుల విభజన జరగాల్సి ఉందని కానీ మోడీ మద్ధతుతో కేసీఆర్ విభజనకు మోకాలడ్డుతున్నారని ఉమా ఎద్దేవా చేశారు.

రాజధాని పనులు శరవేగంగా జరుగుతుంటే ప్రతిపక్షనేత అమరావతిని భ్రమరావతి అంటూ ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ జుట్టు కేసీఆర్ గుప్పిట్లో ఉందని, వైసీపీ అభ్యర్థుల్ని కేసీఆర్, మోడీ కలిసి ఎంపిక చేశారని ఉమా ఆరోపించారు.

తెలంగాణ నుంచి రూ. 5 వేల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు. 11 శాతం జీడీపీతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో తొలి స్థానంలో నిలబెట్టామని ఉమా స్పష్టం చేశారు.