టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు లెఫ్ట్ హ్యాండ్ వంటి కందుల దుర్గేష్‌కే టికెట్ ఇవ్వకపోతే ఇంతకంటే ఘోరం మరొకటి వుండదన్నారు.
టీడీపీ జనసేన పొత్తులో భాగంగా టికెట్ల కేటాయింపుపై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందన్నారు. టికెట్ల ప్రకటన నేపథ్యంలో పవన్‌ను చంద్రబాబు అవమానపరిచారని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన సామాజిక వర్గాన్ని అవమానించినట్లేనని చెల్లుబోయిన దుయ్యబట్టారు.
కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలనే ఆశతోనే పవన్‌ను అవమానపరుస్తున్నారని వేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్‌కు లెఫ్ట్ హ్యాండ్ వంటి కందుల దుర్గేష్‌కే టికెట్ ఇవ్వకపోతే ఇంతకంటే ఘోరం మరొకటి వుండదన్నారు. చంద్రబాబు 95 సీట్లు ప్రకటిస్తే.. పవన్ ఐదు సీట్లు కూడా ప్రకటించుకోలేకపోయారని చెల్లుబోయిన ఎద్దేవా చేశారు. టీడీపీకి రాజ్యసభలో సున్నా.. రేపు పార్లమెంట్‌లోనూ అసెంబ్లీలోనూ సున్నాయే అంటూ జోస్యం చెప్పారు.
అంతకుముందు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. వాళ్లు అమిత్ షాను కలిసినా, అమితాబ్ బచ్చన్‌ను కలిసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. వైసీపీ లిస్టులో ఎలాంటి గందరగోళం లేదని, జనసేన 24 సీట్లకే పరిమితమైందంటే పవన్ సామర్ధ్యం ఏంటో అర్ధం చేసుకోవచ్చునని బొత్స చురకలంటించారు. వారికి విధి విధానాలు ఏమీ లేవని , మళ్లీ దోచుకుతినడానికి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు అంశం తమ పార్టీకి అనవసరమని.. తాము చేసిన అభివృద్ధి, సంక్షేమం చూసి ఓటేయ్యాలని బొత్స సత్యనారాయణ కోరారు. చంద్రబాబు, పవన్‌లు ఏం చేశారని ఓట్లు అడుగుతారని బొత్స ప్రశ్నించారు. గతంలో వారు చేసిన మోసాలను చూసి ఓట్లు వేయాలా అంటూ దుయ్యబట్టారు. జనసేన అవసరమా , కాదా అన్న అంశాన్ని ప్రజలే తేలుస్తారని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.
