ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అప్పులకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అప్పులు చేయలేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఎక్కువ అప్పులు చేయలేదని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. మంగళవారం మంత్రి బుగ్గన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ అప్పులకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మండిపడ్డారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చేసిన అప్పులు తక్కువేనని అన్నారు. కోవిడ్ సంక్షోభం తర్వాత ప్రతి రాష్ట్రం అప్పులు చేసిందన్నారు. 2014 నుంచి 2019 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం బాధ్యత లేకుండా వ్యవహరించిందని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో నిబద్దతో పాలన సాగిస్తున్నామని చెప్పారు. అన్ని రాష్ట్రాలతో పాటు కేంద్రం కూడా అప్పులు చేసిందన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోలిస్తే ఏపీ అప్పులు తక్కువేనని చెప్పారు. పరిమితికి మించి ఏపీ అప్పులు చేయలేదని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ద్రవ్యలోటు ఎక్కువేం కాదని అన్నారు. తెలంగాణలో ద్రవ్యలోటు 4.13 శాతం ఉంటే.. ఏపీలో ద్రవ్యలోటు 3 శాతమే ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాత్రమే అప్పులు చేస్తున్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత టీడీపీ ప్రభుత్వం 8.08 శాతం వడ్డీకి అప్పు తేస్తే తాము 7 శాతానికే తెచ్చామని తెలిపారు.
2018-19లో టీడీపీ ప్రభుత్వం తెచ్చిన అప్పు రూ. 38 వేల కోట్లకు పైనే అని చెప్పారు. కరోనా సంక్షోభంలో తాము చేసిన అప్పు రూ. 40వేల కోట్లు అని తెలిపారు. ఏ సంక్షోభం లేకపోయినా టీడీపీ విచ్చలవిడిగా అప్పులు చేసిందని విమర్శించారు.
