కర్నూలు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో ఈనెల 30న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేబోతున్నారు. 30న కేవలం జగన్ మాత్రమే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 

పదిరోజుల అనంతరం జగన్ కేబినెట్ ప్రమాణ స్వీకారం చేయబోతుందని వైయస్ జగన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. అయితే వైయస్ జగన్ కేబినెట్ లో ఎవరెవరు ఉంటారనే టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది. ఇతరుల విషయం ఎలా ఉన్నా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మాత్రం కన్ఫమ్ అని తెలుస్తోంది. 

ఆది నుంచి పార్టీలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి ప్రాధాన్యత ఇస్తూనే ఉన్నారు వైయస్ జగన్. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్ని సబ్జెక్టులపై అవగాహన కలిగిన వ్యక్తి. అలాగే పార్టీ అప్పగించిన పనిని చిత్తశుద్ధితో చేయడంతో పాటు వివాదాలకు దూరంగా ఉండటంతో జగన్ కు చేరువయ్యారు. 

తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టడంలో బుగ్గన పాత్ర కీలకం. అందువల్ల బుగ్గన రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. అంతేకాదు వైయస్ జగన్ కు అత్యంత నమ్మకస్తుడు, సన్నిహితుడు కూడా. అందువల్లే బుగ్గనకు రూట్ క్లియర్ చేసేశారని టాక్ వినిపిస్తోంది. 

వైయస్ జగన్ శాసన సభాపక్ష నాయకుడుగా ఎన్నుకున్న సమయంలోనూ బుగ్గన కీలకంగా వ్యవహరించారు. జగన్ ను శాసనసభాపక్ష నేతగా మాజీమంత్రి వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ ప్రకటించిన తర్వాత ఆయన ప్రతిపాదనను రాజారెడ్డి బలపరిచారు. 

దీంతో బుగ్గనకు ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమవుతోంది. బుగ్గన గతంలో కూడా పార్టీలో కీలకంగా వ్యవహరించారు. పీఏసీ చైర్మన్ గా అవకాశం వస్తే దాన్ని జగన్ బుగ్గనకే కట్టబెట్టారు. పీఏసీ చైర్మన్ గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అవినీతి అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించడంతోపాటు ఎప్పటికప్పుడు జగన్ కు నివేదికలు అందజేసేవారని పార్టీలో చెప్పుకుంటూ ఉంటారు. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ జగన్ కు అండగా ఉంటూ అన్నీ తానై చూసుకున్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై  జగన్ క్లారిటీ ఇచ్చేశారని తెలుస్తోంది. జగన్ కేబినెట్ లో ఆర్థిక శాఖ మంత్రిగా బుగ్గన వ్యవహరించనున్నారని తెలుస్తోంది.