ఆంధ్రప్రదేశ్ అప్పులపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటరిచ్చారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై రకరకాలుగా మాట్లాడుతున్నారని.. కానీ పార్లమెంట్‌లో దీనిపై కేంద్రం సరైన సమాధానం ఇచ్చిందని బుగ్గన చురకలంటించారు.

విపక్షాలపై మండిపడ్డారు ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి కేంద్రం నుంచి సాయం అందకూడదని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులపై రకరకాలుగా మాట్లాడుతున్నారని.. కానీ పార్లమెంట్‌లో దీనిపై కేంద్రం సరైన సమాధానం ఇచ్చిందని బుగ్గన చురకలంటించారు.

ఏపీకి రూ.4.41 లక్షల కోట్ల అప్పు వుందని కేంద్రం పార్లమెంట్‌లో ప్రకటన చేసిందని .. కానీ ప్రతిపక్షాలు మాత్రం దానిని రూ.10 లక్షల కోట్లని చెబుతున్నాయని ఫైర్ అయ్యారు. తమకు తామే ఆర్ధికవేత్తలుగా ప్రకటించుకుని విపక్షాలు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కంటే టీడీపీ ప్రభుత్వం ఇంకా ఎక్కువగా అప్పులు చేసిందని.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. 

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించకూడదని కుట్ర చేస్తున్నారని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ.. మరో శ్రీలంకలా మారుతుందని దుష్ప్రచారం చేస్తున్నారని.. అప్పుల గురించి మాట్లాడేవారు ఏపీలో ఎవరూ వుండటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంట్ సాక్షిగా అసలు వాస్తవాలు వెలుగుచూశాయని.. వెయ్యి కోట్ల అప్పును ఐదుసార్లు రాస్తే రూ.5 వేల కోట్లు అవుతుందా అని రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. 

Also Read: పులివెందులలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెప్పారు.. నా కుటుంబాన్ని నాశనం చేయడమే లక్ష్యం: అవినాష్ రెడ్డి

మరోవైపు.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందులలో చంద్రబాబు పర్యటనలో అన్ని అబద్దాలే చెప్పారని విమర్శించారు. రాయలసీమలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు.. వాటి సందర్శనకు రావడానికి ఆయనకు ఉన్న ధైర్యం ఏమిటో అర్థం కావడం లేదని అన్నారు. ధర్మం, నిజాయితీ గురించి చంద్రబాబే మాట్లాడాలని ఎద్దేవా చేశారు. కోదమ సింహం అని మనం చెప్పడం కాదని.. ప్రజలు చెప్పాలని అన్నారు. పదే పదే సింహం అని అనుకుంటే ప్రజలు భయస్థుడని అని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. 

పోతిరెడ్డిపాడుకు 11 వేల క్యూసెక్కులకు వెడల్పు చేసింది వైఎస్సార్ మాత్రమేనని అన్నారు. ఆరు జిల్లాలకు నీరిచ్చేందుకు వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని చెప్పారు. బీజేపీలో ఉన్న టీడీపీ నాయకులు, వ్యవస్థలో ఉన్న ఒక పెద్ద మనిషి సాయంతో తనను, తన కుటుంబాన్ని నాశనం చేయాలని, తన ద్వారా సీఎం జగన్‌ను ఇబ్బంది పెట్టాలనేదే చంద్రబాబు లక్ష్యం అని ఆరోపించారు. పులివెందులను వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ది చేస్తుందని చెప్పారు.