మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చినా ప్రజల నుంచి స్పందన లేదన్నారు బొత్స.

పది మంది పెయిడ్ ఆర్టిస్టులు రోడ్ల మీద కనిపించారు తప్పించి స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొన్నవారు లేరని బొత్స ఆరోపించారు. ప్రజల నాడి ఏంటో తమ ప్రభుత్వానికి తెలుసునని, ఆ దిశగానే ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు.

ఐదు మందో , పది మందో అమ్ముడు పోవచ్చు కానీ 100 మంది అమ్ముడుపోరని మంత్రి వ్యాఖ్యానించారు. ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాజధాని చిత్రాలు ప్రజలకు చూపించారని ఎద్దేవా చేశారు.

విశాఖ భూ కుంభకోణంపై త్వరలోనే సిట్‌ దర్యాప్తు పూర్తవుతుందని, దేనిపైనైనా విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. మాన్సాస్‌ వ్యవహారం కుటుంబ తగదా.. ప్రభుత్వానికి ఏం సంబంధం? అని బొత్స ప్రశ్నించారు.

ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. అబద్ధాలు చెప్పడానికి అశోక్‌ గజపతిరాజు వ్యక్తిత్వం ఏమైందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధమవుతుందని, త్వరలో ఆఫీస్ కూడా ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు