ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు వ్యక్తులు కుట్రలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. గుంటూరులో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. విగ్రహాలు ధ్వంసం చేసి మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని బొత్స ఆరోపించారు.

ఎన్నికల పేరుతో సంక్షేమానికి అడ్డు పడుతున్నారని.. ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం ఎన్ని కుట్రలు చేసినా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని మంత్రి  స్పష్టం చేశారు.

నిన్న కూడా విజయనగరంలో మాట్లాడిన బొత్స సత్యనారాయణ... ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని దుష్ట పన్నాగం పన్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరికొంతమంది కలిసి వీటిని‌ చేయిస్తున్నారని విమర్శించారు.

జన సంచారం లేని ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం‌ చేస్తున్నారని చెప్పారు. ప్రజల్లో అలజడి సృష్టించడానికి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

కుట్రపూరితంగా దాడులకు తెగ‌బడే‌ వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామతీర్థం ఘటన సమయంలో సీఎం విజయనగరం జిల్లా పర్యటన ఉందని.. పేదలకు ఇళ్ల పంపిణీని పక్కదారి పట్టించడానికే రాముని విగ్రహం ధ్వంసం చేశారన్నారు.