శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై బీజేపీ నేతలు చేస్తున్న నిరసనలపై మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. తమ వల్ల ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో చెప్పాలని మంత్రి చురకలంటించారు.
శివరాత్రి శుభాకాంక్షలు చెబుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్‌పై దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటరిచ్చారు. జగన్ చేసిన ట్వీట్‌లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. తాము కూడా హిందువులమేనని.. అన్నార్తుల ఆకలి తీర్చడం అన్న మాటలో తప్పేముందని బొత్స నిలదీశారు. బీజేపీ వక్రభాష్యం ఆపాలని.. ఏ రకంగా హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయో చెప్పాలని మంత్రి చురకలంటించారు.
కాగా. మహాశివరాత్రిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో సీఎం జగన్ పంచెకట్టులో ఒక బాలుడికి పాలు తాగిస్తున్నారు.. ఆ చిన్నారి చేతిలో వున్న వస్తువులు, పులి చర్మం , పక్కనే వున్న నందిని చూస్తే.. అచ్చం జగన్ బాల శివుడికి పాలు తాగిస్తున్నట్లుగా వుంది. అంతేకాదు.. అన్నార్తుల ఆకలి తీర్చడే ఈశ్వరారాధన అని కామెంట్ సైతం పెట్టింది.
దీనిపై బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు. తక్షణం ఆ ట్వీట్‌ను వైసీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి తొలగించాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. అంతేకాకుండా జగన్ హిందువులకు క్షమాపణలు చెప్పాలని కోరారు. అలాగే బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు సైతం ఈ పోస్ట్‌పై స్పందించారు. భగవంతుడికే పాలు పోసే స్థాయిలో జగన్‌ను చూపించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని మండిపడ్డారు. సీఎం ఏ మతాన్ని అవలంభించినా.. హిందూ మతాన్ని అవమానించడం బాధాకరమని జీవీఎల్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో ఎంతోమంది పిల్లలు ఆహారం లేదని గగ్గోలు పెడుతున్నారని.. ముందు వాళ్లను పట్టించుకోవాలని జీవీఎల్ నరసింహారావు చురకలంటించారు.
