టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మంత్రి అనిల్ కమార్ యాదవ్. నెల్లూరులోని ఏడో డివిజన్‌లో ఆయన బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నోటి పారుదల శాఖ మంత్రి అని ట్వీట్టర్‌లో కామెంట్ చేస్తున్న లోకేశ్‌కు ధైర్యముంటే సాగునీటి వ్యవస్థపై మీడియా ముందుకు లెక్కలతో వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు.

తాత, తండ్రి పేర్లు చెప్పుకుని బతికే ఆంధ్రా పప్పు లోకేశ్‌కు తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ ఎక్కడుందో.. వాటి సామర్థ్యం, నీళ్లు ఎలా వస్తాయో లోకేశ్‌కు తెలియదని అనిల్ ఎద్దేవా చేశారు.

వరదనీటిని ప్రభుత్వం వృథా చేస్తోందని లోకేశ్ అజ్ఞానంతో విమర్శలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వరదలతో వచ్చిన ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేస్తూ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు.

లోకేశ్ పది మాటలు మాట్లాడితే..అందులో 20 తప్పులు దొర్లుతాయని, అలాంటి ఆయన ఇతరులను విమర్శించడం సిగ్గు చేటన్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో గత పాలకులు రూ.5 లక్షల నిధులు ఉంచి.. రూ. 40 కోట్ల అప్పును మిగిల్చారని ఆ వ్యవస్థను సరి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అనిల్ వెల్లడించారు.

నగరంలో కాలువలపై ఇళ్లను తొలగించాల్సి వస్తే ప్రత్యామ్నాయం చూపిన తర్వాతే తొలగిస్తామని అనిల్ కుమార్ హామీ ఇచ్చారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి ఇళ్లను నిర్మిస్తే.. ఎంతటి వారైనా సరే వారి నిర్మాణాలను తొలగిస్తామన్నారు.