నెల్లూరు:  పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ పై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని... ఒక వ్యక్తి కోసం ఎన్నికలు నిర్వహించాలనుకున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ఇది చెంపపెట్టు లాంటిదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శించారు. సీఈసీ కేవలం చంద్రబాబు చెప్పినట్టే చేస్తానంటే కుదరదన్నారు. టీడీపీ దుర్మార్గాల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.

నాడు నేడుతో బడులు కళకళలాడుతు న్నాయని...ఇది చూసి టీడీపీ నేతల కళ్ళు మండుతున్నాయన్నారు. ఓర్వలేక బడులు మీద కూడా దాడులు చేస్తారని సీఎం జగన్ అందువల్లే అన్నారని... ఆయన మాటలు నిజమేనన్నారు. ఎక్కడ పథకాలు ప్రారంభిస్తారో ఆ ప్రాంతాల్లోనే దాడులు జరుగుతున్నాయి కాబట్టి నెల్లూరు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

జగనన్న అమ్మ ఒడి పథకంలో భాగంగా రెండో ఏడాది నిధుల చెల్లింపును ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు సీఎం జగన్. నెల్లూరులో జరిగిన భారీ బహిరంగ సభలో  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంఫ్యూటర్ బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు.  

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వైసిపి సర్కార్ చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ప్రజలందరికి మేలు జరుగుతుంటే ఓర్వలేకే ఆలయాల ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు, శక్తుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పుడు గుడులపై దాడులు చేస్తున్నవారు ఇకపై బడులపైనా దాడులు చేయవచ్చు... కాబట్టి ప్రజలు, అధికారులు జాగ్రత్తగా వుండాలని జగన్ పేర్కొన్నారు.