తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలిగిన తర్వాత బీజేపీ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఎనిమిదేళ్ల తర్వాత బాబ్లీ ప్రాజెక్టు ఘటనకు సంబంధించి కేసు తెరపైకి రావడం కుట్రపూరితమేనన్నారు. 


గుంటూరు: తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి వైదొలిగిన తర్వాత బీజేపీ తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. ఎనిమిదేళ్ల తర్వాత బాబ్లీ ప్రాజెక్టు ఘటనకు సంబంధించి కేసు తెరపైకి రావడం కుట్రపూరితమేనన్నారు. బాబ్లీ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందన్న కారణంతో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు ప్రజల పక్షాన పోరాడారని గుర్తు చేశారు. 

బాబ్లీ ఘటన సమయంలో ఐదు రోజుల పాటు మహారాష్ట్ర పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని ఆవిషయం తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు యావత్ దేశం మెుత్తం తెలుసునన్నారు. చంద్రబాబు మినహా అందరిపైనా భౌతిక దాడులు చేశారన్నారు. 

ఇప్పటికైనా కేసును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు చంద్రబాబుకు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అన్ని పార్టీలు స్పందిస్తుంటే వైసీపీ, జనసేన పార్టీలు స్పందించకపోవడం శోచనీయమన్నారు. ఇకనైనా జగన్‌, పవన్‌ కల్యాణ్‌ స్పందించాలని మంత్రి ఆనందబాబు డిమాండ్‌ చేశారు.