జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిందే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కోసమంటూ వ్యాఖ్యానించారు మంత్రి అంబటి రాంబాబు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణలో మాదిరిగా ఓటుకు నోటు లాంటిది జరిగిందని ఆయన ఆరోపించారు.  

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లపై మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈరోజు కడప జిల్లా ఒంటిమిట్ట ఆలయంలో పట్టువస్త్రాలు సమర్పించారు మంత్రి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఒక మ్యానిప్యులేటర్ అని అభివర్ణించారు. ఆయన వ్యవస్థల్ని మేనేజ్ చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారని రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఆయన ఆస్తులను, కొడుకును పునర్ నిర్మిస్తాడని , ప్రజలకు ఏం చేయడని వ్యాఖ్యానించారు మంత్రి.

పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన తప్పులన్నింటికీ టీడీపీయే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణంలో అనేక తప్పిదాలు జరిగాయని.. దీని వల్ల అంచనా వ్యయం పెరిగిందని అంబటి పేర్కొన్నారు. ఇక పవన్ కల్యాణ్ చంద్రబాబు కోసమే పుట్టాడని.. ఆయన కోసమే పనిచేస్తున్నాడని దుయ్యబట్టారు. పవన్‌ను దేవుడే రక్షించాలంటూ అంబటి రాంబాబు చురకలంటించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణలో మాదిరిగా ఓటుకు నోటు లాంటిది జరిగిందని ఆయన ఆరోపించారు. 

ఇదిలావుండగా.. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి వైఎస్ జగన్ మీద వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని అన్నారు. రాష్ట్రంలో పడిపోతున్న తమ పార్టీ గ్రాఫ్ ను చూపించి ఈ పనిచేసే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీతో ముందస్తు ఎన్నికల గురించి చర్చించే అవకాశం ఉందన్నారు. తెలంగాణతో పాటే ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని.. దీనికి సహకరించాలని ముఖ్యమంత్రి ప్రధానిని కోరే అవకాశం ఉందన్నారు.

ALso REad: ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు.. జగన్ ఢిల్లీ పర్యటనకు మూలం అదే.. రఘురామ

ఢిల్లీలో బుధవారం ఈ మేరకు ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన పోలవరం పెండింగ్ బిల్లులు, ప్రత్యేక హోదా సాధన కోసమే అని పైకి చెబుతున్నారు. కానీ,అంతర్గతంగా అసలు కారణాలు వేరే ఉన్నాయని తెలుస్తోంది అన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా చూడడం కోసం, మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న శివశంకర్ రెడ్డికి బెయిల్ కోసం ఆయన ఢిల్లీకి పర్యటిస్తున్నారని రఘురామా ఆరోపణలు గుప్పించారు.

అవినాష్ రెడ్డి జైలుకు వెళ్లకుండా కాపాడుకోవాలని ఒకవేళ వెళ్ళినా చివరి విచారణ తమమీదికి రాకుండా చూసుకోవాలని వైయస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కోరే అవకాశాలు ఉన్నాయని వాదనలు వినిపిస్తున్నాయని అన్నారు. అంతేకాదు తాను ఎవరినైతే అరెస్టు చేయాలని అనుకుంటున్నాడో.. వారిని అరెస్టు చేసి ఆనందించడానికి కేంద్రం అనుమతి కోసం ఢిల్లీ పర్యటన అని రఘురామకృష్ణం రాజు తీవ్రస్థాయిలో వైయస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అరెస్టులకు కేంద్రం నుంచి అనుమతులు అవసరం లేదు. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారని రఘురామా అన్నారు.