చంద్రబాబు తనను అంబోతు రాంబాబు అంటున్నారని.. ఆయన రాజకీయ జీవితం అంతా అంబోతులకు ఆవులు సప్లై చేయడం మాత్రమేనని.. అందువల్లే ఆయన పైకొచ్చారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు తనను ఆంబోతు రాంబాబు అంటున్నారని.. ఆయన రాజకీయ జీవితం అంతా ఆంబోతులకు ఆవులు సప్లై చేయడం మాత్రమేనని.. అందువల్లే ఆయన పైకొచ్చారని విమర్శించారు. చంద్రబాబు తన స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాను బాధ్యత కలిగిన జలవనరుల శాఖ మంత్రినని చెప్పారు. 2018 వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తిచేస్తానని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారు?, కేంద్రం పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును చంద్రబాబుఎందుకు తీసుకున్నారు?, కాఫర్ డ్యాం పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎందుకు కట్టారు? అని ప్రశ్నించారు. తన మూడు ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇరిగేషన్ మీద తాను వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే చంద్రబాబు తనపై విమర్శలు చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు రాయలసీమ మొత్తంలో ఒక ప్రాజెక్టుకైనా ఫౌండేషన్ వేశావా? పూర్తి చేశావా? అని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు తెలుగు గంగ తీసుకొచ్చారని అన్నారు. తెలుగు గంగ డిశ్చార్జ్ పెంచిన ఘనత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిది అని అన్నారు. పోలవరం, పులిచింతల ఎవరు ప్రారంభించారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించి.. పనులను పరుగులు పెట్టించింది వైఎస్సార్ కాదా? అని ప్రశ్నించారు.
చంద్రబాబు శంకుస్థాపన చేసి, ప్రారంభించిన ప్రాజెక్టు ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు పచ్చి అబద్దాల కోరు అని విమర్శించారు. తన ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ.. అయితే కొన్ని విషయాలు చెప్పాల్సినవి ఉంటాయని.. కొన్ని చెప్పకూడనివి ఉంటాయని అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర షేకావత్‌ను కలిసి పోలవరం గురించి మాట్లాడటం జరిగిందని.. వీలైనంతా త్వరగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారని పేర్కొన్నారు.
చంద్రబాబు ఆపిన ప్రాజెక్టులను వైఎస్సార్ పూర్తి చేశారని చెప్పారు. చంద్రబాబు లై డిటెక్టర్ కూడా బయటపెట్టలేని విధంగా అబద్దాలు చెప్పగలరని విమర్శించారు. పవన్‌ను విమర్శిస్తే చంద్రబాబుకు నొప్పి కలుగుతుందని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా ఉండి ప్రాజెక్టులు పూర్తిచేయని చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తానని అంటున్నారని విమర్శించారు. టీడీపీ హయాంలో చేసిన తప్పిదాల వల్ల పోలవరం ప్రాజెక్టు నష్టం వాటిల్లిందని.. ఎంతో మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. తమ హయాంలో కడా గైడ్‌బండ్ కుంగిందని.. అది చిన్న తప్పిదమని.. అది ఎలా జరిగిందనేది కూడా చూస్తున్నామని.. దానితో పెద్ద ప్రమాదం లేదని చెప్పారు. అలా ఎందుకు జరిగిందనే దానిపై కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు.
పవన్ వేరే సినిమాల గురించి తాను మాట్లాడానా? అని ప్రశ్నించారు. పవన్ బ్రో సినిమాలో పాలిటిక్స్ పెట్టి తమను గిల్లాడు కనుకే తాము మాట్లాడుతున్నామని చెప్పారు. నీతి, నిజాయితీ గలవారు ఎవరైనా ఉన్నారా అంటే పవన్ కల్యాణ్ ఆయనే అని ముందుకు వస్తారని.. కానీ నిజాయితీగా ఉండడని అన్నారు. బ్రో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది పవన్ కల్యాణ్ చెప్పాలని.. ఎంత ఇచ్చారనేది నిర్మాతనైనా వెల్లడించాలని డిమాండ్ చేశారు. రెమ్యూనరేషన్ గురించి చెప్పమని నిర్మాత అంటున్నారని అన్నారు. సినిమా రెమ్యూనరేషన్ చెప్పని వ్యక్తి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు.
జనసేన వాళ్లు తనపై సినిమా తీస్తున్నారని.. విలన్‌గా పెడతారా? హీరోగా పెడతారా? అనేది సంబంధం లేదని అన్నారు. తన పేరు మీద సినిమా వస్తుందంటే సంతోషమని అన్నారు.
