ఏపిలో 1332 చేరిన పాజిటివ్ కేసులు...నాకు కూడా కరోనా పరీక్ష: మంత్రి ఆళ్లనాని
ఆంధ్ర ప్రదేశ్ లో అత్యధిక కరోనా పరీక్షలు నిర్వహించడం వల్లే పాజిటివ్ కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నట్లు ఆరోగ్యమంత్రి ఆళ్లనాని వెల్లడించారు.
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ మహమ్మారీ సామాన్యులనే కాదు ప్రభుత్వ పెద్దలు, రాజ్యాంగ పదవుల్లో వున్నవారిని సైతం భయాందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వోద్యోగి, పోలీసులు, రాజ్ భవన్ ఉద్యోగి సైతం ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేషీలోని ఉద్యోగికి సైతం కరోనా పాజిటివ్ గా తేలింది.
తన పేషీలో పని చేసే అటెండరుకు కరోనా పాజిటీవ్ వచ్చిందని స్వయంగా మంత్రి నాని ప్రకటించారు. తనతో సహా పేషీలో పని చేసే 13 మందికి పరీక్షలు నిర్వహించినట్లు... అయితే అందరికీ నెగెటీవ్ వచ్చిందన్నారు.
ఏపీలో ఇప్పటివరకు 88,061 టెస్టుల వరకు నిర్వహించగా వీటిల్లో 1332 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అన్ని జిల్లాల్లో పటిష్టమైన సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇంటింటి సర్వేలో గుర్తించిన 32 వేల మంది అనుమానితుల టెస్టింగ్ ప్రాసెస్ త్వరగా పూర్తి చేయనున్నట్లు తెలిపారు. కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టామన్నారు. లాక్ డౌన్ విషయంలో కేంద్ర మార్గ దర్శకాలను పాటిస్తున్నట్లు వెల్లడించారు.
ఇంట్లొంచి బయటకొచ్చే పరిస్థితే ఉంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలకు సూచించారు. కరోనా లక్షణాలు కన్పించని కేసులే ఎక్కువగా ఉంటున్నాయని ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.