Asianet News TeluguAsianet News Telugu

మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అఖిలప్రియ హల్ చల్

తాము చెప్పిన వాళ్లకే పనులు చేయాలని ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. హౌసింగ్‌ విభాగంలోకి వెళ్లి.. ‘మీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నది ఎవరు? జాగ్రత్తగా పని చేయకపోతే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

minister akhila priya visits muncipal office
Author
Hyderabad, First Published Oct 17, 2018, 11:55 AM IST

కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మంత్రి అఖిలప్రియ హల్  చల్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మంత్రి రావడంతో అధికారులు ఖంగుతిన్నారు. కమిషనర్‌ పుల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తాము చెప్పిన వాళ్లకే పనులు చేయాలని ఉద్యోగులకు హుకుం జారీ చేశారు. హౌసింగ్‌ విభాగంలోకి వెళ్లి.. ‘మీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. మిమ్మల్ని ఉద్యోగంలోకి తీసుకున్నది ఎవరు? జాగ్రత్తగా పని చేయకపోతే మిమ్మల్ని ఎవరూ కాపాడలేరం’టూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


కార్యాలయంలో ఉద్యోగులపై మండిపడిన మంత్రి ఇంతటితో ఆగకుండా చైర్‌పర్సన్‌ లేని సమయంలో ఆమె చాంబర్‌లోకి వెళ్లడం విమర్శలకు తావిచ్చింది. చాంబర్‌లోకి వెళ్లీ వెళ్లడంతోనే ‘ఈమెకు (చైర్‌పర్సన్‌కు) ఇంత చాంబర్‌ అవసరమా?! గవర్నమెంట్‌ అధికారులకు కూడా ఇన్ని సౌకర్యాలు లేవు. ఇక్కడ ఇన్ని కుర్చీలు అవసరమా? ఆఫీసంతా సీసీ కెమెరాలున్నాయి. సీసీ కెమెరాల మానిటరింగ్‌ చైర్‌పర్సన్‌ చాంబర్‌లో ఎలా పెడతారు? ఆమె ఇక్కడ కూర్చొని కార్యాలయంలోకి ఎవరెవరు వస్తున్నారు.. ఏ విభాగంలో ఏం పనులు జరుగుతున్నాయి.. అని మానిటరింగ్‌ చేస్తోందా? వెంటనే వీటిని తొలగించండి’ అంటూ అధికారులను ఆదేశించారు.  

కాగా ప్రజలు ఎన్నుకుంటే తాను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అయ్యానని, వారికి ఏయే పనులు చేయాలో చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని దేశం నంద్యాల మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సులోచన స్పష్టం చేశారు. మంత్రి మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చినప్పుడు తనకు సమాచారం కూడా ఇవ్వకపోవడం ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తాను లేనప్పుడు చాంబర్‌లోకి వెళ్లి పరిశీలించే హక్కు మంత్రికి ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. తన చాంబర్‌లో సీసీ కెమెరాల మానిటరింగ్‌ లేదని, మంత్రి ఈ విషయం తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios