లోకేష్‌ నిజంగా ఉన్నత చదువులు చదివి ఉంటే, ఆ డిగ్రీలు నిజమే అయితే, చదువు విలువ తెలిసిన వాడైతే సీఎం నిర్ణయాన్ని తప్పు పట్టడు అంటూ లోకేష్ పై విద్యాశాఖ మంత్రి విరుచుకుపడ్డారు. 

అమరావతి: విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటుంటే సీఎం జగన్‌పై లోకేష్‌ అవాకులు, చెవాకులు పేలుతున్నాడని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్‌ వాడిన పదజాలం, ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆక్షేపణీయమని... వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లోకేష్‌ నిజంగా ఉన్నత చదువులు చదివి ఉంటే, ఆ డిగ్రీలు నిజమే అయితే, చదువు విలువ తెలిసిన వాడైతే సీఎం నిర్ణయాన్ని తప్పు పట్టడు అంటూ లోకేష్ పై విద్యాశాఖ మంత్రి విరుచుకుపడ్డారు. 

''గత ఏడాది విద్యా సంవత్సరం నష్టపోయారు. విద్యార్థులకు మళ్లీ నష్టం కలగకుండా విద్యా సంవత్సరాన్ని గాడిలో పెడుతూ, విద్యార్థుల మేలు కోసం ఈ నిర్ణయం తీసుకుంటే ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని, జూమ్‌ కాన్ఫరెన్సులో హైదరాబాద్‌ నుంచి మాట్లాడుతున్నాడు. అక్కడ ఆయన ఉండి ఇక్కడ పిల్లల గురించి మాట్లాడుతున్నాడు'' అని మండిపడ్డారు. 

''లోకేష్‌ ఒక అజ్ఞాని అని రుజువు చేసుకున్నాడు. అందరూ ఆయనను వెర్రినాయుడు అంటున్నారు. ఈ అవకాశాన్ని ఆయన రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాడు. నిజానికి సీఎం జగన్‌ పిల్లలకు మేనమామగా వారిని చదివిస్తూ, వారికి అన్ని విధాలుగా అండగా ఉంటూ, బాగా చదువుకోవాలని ఫీజులు చెల్లిస్తూ, హాస్టల్‌ ఖర్చులు కూడా భరిస్తూ, ఎన్నో చేస్తున్నారు. కానీ లోకేష్‌ మాదిరిగా ఎవరో ఫీజు కడితే, ఎవరో పరీక్ష రాస్తే పాస్‌ అవలేదు. అలాంటి వ్యక్తి స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో చదువుకున్నానని చెబుతావు'' అని విద్యామంత్రి విమర్శించారు. 

''ఇక్కడ విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలతో వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెట్టడం, నాడు–నేడుతో స్కూళ్లలో సమూల మార్పులు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన ద్వారా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారు. ఒక్క ఏడాదిలోనే దాదాపు 4.5 లక్షల పిల్లలు ప్రభుత్వ స్కూళ్లలో చేరారు'' అని తెలిపారు. 

read more ప‌రీక్ష‌లు ర‌ద్దుకు 48 గంట‌ల డెడ్‌లైన్‌... లేదంటే పోరాటమే..: లోకేష్ హెచ్చరిక

''పరీక్షలు నిర్వహిస్తే దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు కరోనా సోకుతుందని లోకేష్‌ చెబుతున్నాడు. కరోనా వస్తుందని, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. సీఎంపై బురద చల్లే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. వకీల్‌సాబ్‌ సినిమాను నాలుగు కాదు, ఆరు షోలు వేయాలని చంద్రబాబు అన్నాడు. దాన్ని రాజకీయం చేసి తిరుపతి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూసినప్పుడు, లోకేష్‌ ఎక్కడికి పోయావు? అప్పుడు నీకు కరోనా ముప్పు కనిపించలేదా? నీకు అవేవీ కనబడవు. ఎందుకంటే వకీల్‌సాబ్‌ సినిమాతో రాజకీయ ప్రయోజనం పొందాలని చూశావు'' అని ఆరోపించారు. 

''ప్రజలు ఒకే చోట చేరితే కరోనా వ్యాపిస్తుందని సీఎం జగన్‌ తిరుపతి ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకుంటే అర్ధం లేని విమర్శలు చేశారు. దాన్ని కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేశారు. ఇవాళ దాదాపు 70 లక్షల విద్యార్థుల ఆరోగ్య భద్రత గురించి ఏదేదో మాట్లాడుతున్నారు'' అన్నారు. 

''లోకేష్‌... మీరు జూమ్‌ కాన్ఫరెన్సు ద్వారా పిల్లల భద్రత బాధ్యత తీసుకున్నారని భావిస్తే.. కరోనా వచ్చినప్పటి నుంచి పిల్లల శ్రేయస్సు, ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఏమేం చేసిందో ఒక్కసారి తెలుసుకో. శానిటైజ్‌ చేయడం, పిల్లల్లో అవగాహన పెంచడం వంటి ఎన్నో చర్యలు. విద్యామృతం, టీవీల్లో, రేడియోల్లో కార్యక్రమాలు, ఇంటర్నెట్‌ స్ట్రీమింగ్‌ ద్వారా కార్యక్రమాల ద్వారా ఏదో విధంగా 10వ తరగతి పరీక్షల కోసం సీఎం ఎంతో కృషి చేశారు. దేశమంతా పిల్లలను ప్రమోట్‌ చేస్తే, ఇక్కడ గత ఏడాది 6వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించాము. విద్యా సంవత్సరం ముగిశాకే సెలవులు ఇచ్చాం. గత ఏడాది కూడా 10వ తరగతి పరీక్షలు నిర్వహించాము. అయితే సప్లిమెంటరీ మాత్రం నిర్వహించలేకపోయాము. నీవు ఏపీలో ఉంటే నీకు తెలిసేది. కానీ నీవు లేవు. అక్కడ హైదరాబాద్‌లోనే ఉండిపోయావు'' అంటూ లోకేష్ పై సెటైర్లు విసిరారు విద్యామంత్రి.