హైదరాబాద్‌: వందలాది మంది చిన్నారులకు కొత్త జీవితాలు ప్రసాదించిన హీరో రాఘవ లారెన్స్ నిజమైన హీరో అని మెగాస్టార్ చిరంజీవి కొనియాడారు. లారెన్స్ సినీరంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తూ సేవా కార్యక్రమాల్లో కూడా మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నట్లు సందేశం పంపారు. 

వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ లో ప్రముఖ హీరో, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్‌ నటించిన కాంచన 3 మూవీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి తరపున ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి తరపున లారెన్స్ ట్రస్ట్ కు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. లారెన్స్ తన ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు వందలాది చిన్నారులకు శస్త్రచికిత్సలు చేయించి వారికికొత్త జీవితాలు ప్రసాదించారని అభిప్రాయపడ్డారు. 

భవిష్యత్ లో కూడా రాఘవ లారెన్స్ కు తాము అండగా ఉంటామని చిరంజీవి హామీ ఇచ్చినట్లు అల్లు అరవింద్ తెలిపారు. ఇకపోతే లారెన్స్ దర్శకత్వంలో ఆయనే హీరోగా నటిస్తున్న చిత్రం కాంచన 3. 

ముని సినిమా సిరీస్ లో భాగంగా వస్తోన్న మూడో సినిమా కాంచన 3 కావడం విశేషం. ఈ చిత్రంలో ఓవియా, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోవై సరళ రాఘవ లారెన్స్ కు తల్లిగా నటిస్తున్నారు. ఈసినిమా ఏప్రిల్ 19న విడుదల కానుంది. 

ఇకపోతే మెగాస్టార్ చిరంజీవికి రాఘవ లారెన్స్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన పలు చిత్రాల్లో కొరియోగ్రాఫర్ గా పనిచేశారు లారెన్స్. పలువేదికలపై ఇద్దరూ చిరంజీవి లారెన్స్ తన తమ్ముడు అంటూ చెప్పుకొచ్చారు.